గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 01:52:38

నేర రాజకీయాల గుట్టురట్టు

నేర రాజకీయాల గుట్టురట్టు

  • ఇవీ మన పీవీ ఘనతలు

క్రిమినల్‌ సిండికేట్లకు రాజకీయ నాయకులతో, అధికారులతో గల తెరచాటు సంబంధాలను బయట పెట్టడానికి పీవీ ప్రభుత్వం వోహ్రా కమిటీ రూపంలో ఒక ప్రయత్నం చేసింది. ప్రధాని పీవీ రాజకీయాలను ప్రక్షాళన చేయలేకపోయినా తేనె తుట్టెను మాత్రం కదిలించారు. 

1993 మార్చిలో ముంబయి సీరియల్‌ బాంబు పేలుళ్ళు జరిగాయి. ఈ సందర్భంగా మాఫియాకు రాజకీయ నాయకులకు సంబంధాలున్నాయనే విషయమై గగ్గోలు పుట్టింది. దీంతో పీవీ ప్రభుత్వం 1993 జూలైలో నాటి హోం శాఖ కార్యదర్శి ఎన్‌.ఎన్‌. వోహ్రా నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. క్రైం సిండికేట్లు/మాఫియాతో సంబంధాలు పెట్టుకొని వాటిని కాపాడుతున్న అధికారులు, రాజకీయ నాయకుల కార్యక్రమాలపై సమాచారం సేకరించడం ఈ కమిటీ లక్ష్యం. అతి వేగంగా 1993 అక్టోబర్‌లో వోహ్రా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ కమిటీ నివేదికలోని వివరాలు ముంబయి పేలుళ్ల కన్నా భయంకరంగా ఉన్నాయి. దీంతో బయట పెట్టలేక పోయారు. ఇప్పటికీ అవినీతి, నేర రాజకీయాలపై చర్చకు ఈ కమిటీ నివేదిక కేంద్ర బిందువుగా ఉంటున్నది. 


వోహ్రా కమిటీ వెల్లడించిన అంశాల ఆధారంగా దర్యాప్తు సాగించి దోషులను శిక్షించాలని సుప్రీం కోర్టు 1997లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నివేదికలోని కొన్ని అంశాలను న్యాయస్థానం ప్రస్తావించింది. నేర ముఠాలు, అధికారులు, నాయకులు కుమ్మక్కయి సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని వోహ్రా కమిటీ పేర్కొన్నది. నగరాలలో రియల్‌ ఎస్టేట్‌ను ఆసరాగా చేసుకుని నేరస్థ ముఠాలు చెలామణి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా క్రిమినల్‌ గ్యాంగ్స్‌ ఏర్పడి పోలీసులు, అధికారులు, నాయకులతో సంబంధాలు నెలకొల్పుకున్నాయి. సాయుధ ముఠాలు, డ్రగ్‌ మాఫియా, స్మగ్లింగ్‌ గ్యాంగ్స్‌, ఆర్థిక నేరస్థులు దేశమంతా అల్లుకుపోయి అధికారులతో, నాయకులతో సంబంధాలు పెట్టుకున్నారు. వ్యక్తిగత నేరాలను అరికట్టడానికి రూపొందించి మన చట్టాలు ఈ నేర ముఠాలను అరికట్టలేక పోతున్నాయని కమిటీ నివేదికలోని సారాంశాన్ని సుప్రీం కోర్టు వెల్లడించింది. 

నేర రాజకీయాలను నిర్మూలించడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు గమనార్హమైనవి. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తమపై నేర చరిత్రను ఎన్నికల కమిషన్‌కు వెల్లడించాలి. తమపై ఉన్న కేసుల వివరాలను తమ పార్టీకి సమర్పించాలి. పార్టీలు తమ అభ్యుర్థుల మొత్తం వివరాలను ప్రజల తెలుసుకోవడానికి వీలుగా వెబ్‌సైట్‌లో పెట్టాలి. అభ్యర్థులు తమ నేర చరిత్రను స్వయంగా , పార్టీ ద్వారా పత్రికాముఖంగా వెల్లడించాలి. టీవీ చానెల్స్‌ ద్వారా కూడా వెల్లడించాలి. దీని వల్ల రాజకీయ పార్టీలు ప్రక్షాళన చెందే అవకాశం ఉంది. 

మనం పరస్పరాధార ప్రపంచంలో ఉన్నాం. ఈ కాలంలో ప్రాంతీయ సహకారానికి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. దక్షిణాసియాలో సార్క్‌ ద్వారా కొంత పురోగతి సాధించాం. అయితే ప్రధానాంశమైన ఆర్థిక సహకారం విషయంలో ఇంకా ముందడుగు పడలేదు...  గతంలో స్వాతంత్య్రం కోసం సాగించిన సమరానికి కొనసాగింపే కొత్తగా అవతరించిన రాజ్యాలు అనుసరిస్తున్న అలీన విధానం. ఉమ్మడి లక్ష్యాలు ఈ దేశాలను ఏకతాటిపై నిలుపుతుంది. శాంతి, భద్రత, నిరాయుధీకరణ, ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ పరిస్థితులు ఈ దేశాలను ఏకతాటిపైకి చేర్చగలవు. 

-పీవీ నరసింహారావు(1992 మార్చి 12, పోర్ట్‌ లూయిస్‌లో మారిషస్‌ అధ్యక్షుడు రింగడూ స్వాగతం పలికిన సందర్భంగా చేసిన ప్రసంగం)


logo