శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 17:20:28

గల్ఫ్ కార్మికుడికి మాజీ ఎంపీ కవిత చేయూత

గల్ఫ్  కార్మికుడికి  మాజీ ఎంపీ కవిత చేయూత

హైదరాబాద్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశం సౌదీ అరేబియాకు వలస వెళ్లి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న నిజామాబాద్ వ్యక్తికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం అందించారు. మాజీ ఎంపీ సహకారంతో భూక్య దశరథ్ మరొక సహాయకుడు తన వెంట రాగా సౌదీ అరేబియా నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం బాలానగర్ కు చెందిన భూక్య ధశరథ్ (లంబాడి శంకర్) ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా దేశానికి వెళ్లాడు. అయితే అక్కడ పక్షవాతం బారిన పడడంతో చికిత్స నిమిత్తం సౌదీ లోనే ఆసుపత్రి లో చేరాడు. 

ఇదే సమయంలో దశరథ్  ఇకామా( రెసిడెన్సీ వీసా) గడువు తేదీ ముగియడంతో స్వస్థలానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు వీసా గడువు ముగియడంతో దశరథ్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇదే సమయంలో అతని సోదరుడు లంబాడి విఠల్, సౌదీలో దశరథ్ తో ఉండి అన్ని సేవలు చేశాడు.  దశరథ్ పరిస్థితి గురించి స్థానిక సర్పంచ్ నిహారిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లింది. ఎమ్మెల్యే గోవర్ధన్ మాజీ ఎంపీ కవితకు విషయం తెలిపి మంచానికే పరిమితమైన దశరథ్ ను ఇంటికి తీసుకురావాలని కోరాడు. కవిత సూచనతో సౌదీ జాగృతి అధ్యక్షుడు మౌజం అలీ ఇఫ్తెకార్ అక్కడ దశరథ్, విఠల్ ఇరువురితో మాట్లాడి ధైర్యం చెప్పి సహాయం అందించారు.

అలాగే   దశరథ్, అతని సహాయకుడు విఠల్ ఇరువురు హైదరాబాద్ వచ్చేందుకు రూ.ల 55,000 తో టిక్కెట్లు ఏర్పాటు చేశారు‌ మాజీ ఎంపీ కవిత. గురువారం  హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న దశరథ్ తో  కవిత ఫోన్ లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ధైర్యం చెప్పారు. కవిత సూచనతో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అధికారులతో మాట్లాడి ఇరువురిని హోం క్వారెంటైన్ కు అనుమతి ఇప్పించడంతో పాటు స్వస్థలానికి వెళ్ళేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. నేడు ఇంటికి చేరుకున్న లంబాడి దశరథ్ ను తెలంగాణ జాగృతి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు  పరామర్శించారు.

  ఆపదలో ఉన్నప్పుడు తమను ఆదుకుని అండగా నిలిచిన మాజీ ఎంపీ కవితకి, విషయం కవిత దృష్టికి  తీసుకువెళ్లిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కి దశరథ్, విఠల్ ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుబాన్ని పరామర్షించిన వారిలో  జాగృతి సౌదీ అరేబియా అధ్యక్షుడు ఇఫ్తెకార్, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్, జెడ్పీటీసీ తనూజ, వైస్ ఎంపీపీ కుంచాల రాజు, బాలానగర్ సర్పంచ్ నిహారిక జాగృతి నాయకులు ఉన్నారు.


logo