బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 14:57:26

ఉద్యమ కెరటం.. మహాకవి దాశరథి

ఉద్యమ కెరటం.. మహాకవి దాశరథి

హైదరాబాద్ : తరతరాల బూజు మా నిజాం అని.. మహాకవి దాశరథి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాకవి అని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కీర్తించారు. మహాకవి దాశరథి 96 వ జయంతిని రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దాశరథి అంటేనే ఉద్యమాల నెగడు. జైల్లో  నిర్బంధించిన జైలు గోడల మీద కవిత్వాన్ని రాసి ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన కలం యోధుడు అని పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాతనే తెలంగాణ కవులకు గౌరవం లభిస్తుందన్నారు. వారి జయంతులను అధికారికంగా భాషా సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కవుల పక్షపాతిగా అభివర్ణించారు. దాశరథి జయంతిని అధికారికంగా నిర్వహించటానికి ఆదేశాలు ఇవ్వడమే కాక, ప్రతి సంవత్సరం ప్రముఖ కవులకు సత్కారం, పురస్కారాలను అందిస్తున్నారన్నారు. 2020 సంవత్సరపు దాశరథి పురస్కారాన్ని డా. తిరునగరి రామనుజయ్య ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.


నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరథి అన్న మాట ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలందరినీ ఉర్రూతలూగించిందన్నారు. సీఎం కేసీఆర్ దాశరథి మాటలనే స్ఫూర్తి గా తీసుకొని ఇప్పుడు తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసే మహాయజ్ఞం చేస్తున్నారు. ఈ సందర్భంగా దాశరథి కుటుంబ సభ్యులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, దాశరథి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


logo