మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:50:43

అంగన్‌వాడీలకు టెట్రాప్యాక్‌లో పాలు

అంగన్‌వాడీలకు టెట్రాప్యాక్‌లో పాలు

  • నిధులు కేటాయించాలి: మంత్రి తలసాని
  • మిగతా ప్రతిపాదనలపైనా ఆర్థికమంత్రి హరీశ్‌కు వినతి 

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: పశు,మత్స్య, డెయిరీ రంగాల్లో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచేలా ముందుకుసాగాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులకు సూచించారు. మంగళవారం అరణ్యభవన్‌లో  పశుసంవర్ధక, మత్స్య, ఆర్థికశాఖ అధికారులతో మంత్రులు సంయుక్తసమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీల ద్వారా గర్భిణులకు పాల సరఫరాను టెట్రాప్యాక్‌లో పంపేందుకు ఆర్థికవనరులు సమకూర్చాలని మంత్రి హరీశ్‌రావును మంత్రి తలసాని కోరారు. పాల సేకరణ ఇన్సెంటివ్‌, గొర్రెలు, మేకల్లో నట్టల నివారణకు, గోపాలమిత్రకు నిధులు మంజూరుచేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని ఆర్థికశాఖ అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉమ్మడిపథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, కేంద్రం వాటా నిధులు వచ్చేలా ప్రణాళికలు తయారుచేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. నట్టల మందులు పశువులకు సమయానికి తగ్గట్టుగా వేయాలని ఇందుకు సహకరిస్తామని చెప్పారు. గొర్రెలు, మేకల పెంపకం, చేప పిల్లల పంపిణీ వల్ల రాష్ట్రంలో పశు, మత్స్యసంపద అపారంగా పెరిగిందని మంత్రులు  అభిప్రాయపడ్డారు. దేశంలో పశు,మత్స్య సంపదలో తెలంగాణ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయడైరీని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. సమీక్షలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, మహిళా,శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్య, టీఎస్‌ఎల్డీఏ సీఈవో మంజువాణి, విజయడైరీ ఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


logo