మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 17:49:23

కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది పని తీరు భేష్‌ : మంత్రి జగదీష్ రెడ్డి

కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది పని తీరు భేష్‌ : మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ : కరోనా కట్టడిలో ఉమ్మడి నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు భేషుగ్గా ఉందని  విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికుల్లా పనిచేస్తున్న వైద్య సిబ్బంది పనితీరుతో దవాఖానలపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్-19పై ఆయన సోమవారం సాయంత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్,వినయ్ కృష్ణారెడ్డి, అనితా రామచంద్రన్ లతో పాటు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల వైద్య ఆరోగ్యశాఖాదికారులు, నల్గొండ, సూర్యా పేట మెడికల్ కళాశాల ప్రిన్సి పాల్స్,  వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవగాహన లేక అక్కడక్కడా జరుగుతున్న అంశాలపై అపశృతులు దొర్లుతున్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు. నిజానిజాలు ఏమిటో ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు అన్నారు. ప్రాణాలకు తెగించి ప్రాణాంతక వ్యాధి నుంచి సామాన్య పేద ప్రజలను కాపాడే వైద్య ఆరోగ్య సిబ్బంది మనోధైర్యం కోల్పోవద్దన్నారు. సమాచార లేమితో పుకార్లు షికార్లు చేస్తున్నాయని ప్రభుత్వం అన్నీ గమనిస్తోందని ఆయన చెప్పారు. అయితే అదే సమయంలో 24 గంటలు పని చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది అసహనానికి లోను కావొద్దన్నారు.

కరోనాను  అరికట్టడంలో మన రాష్ట్రం ముందుందని మంత్రి తెలిపారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సామాన్య పేద ప్రజానీకం ప్రభుత్వ వైద్య శాలలకు తరలి రావడమే ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు.  కొవిడ్ రోగుల్లోనూ మనోధైర్యాన్ని పెంపొందించేందుకు సిబ్బంది పడుతున్న శ్రమ అద్భుతమైన ఫలితాలు ఇస్తుందన్నారు. ఇకపై డివిజన్ కేంద్రాల్లో ఉన్న ఏరియా దవాఖానల్లోనూ కొవిడ్ టెస్ట్ లు ఉంటాయని మంత్రి వెల్లడించారు. నల్గొండ, సూర్యాపేట  దవాఖానల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో వైద్యం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
logo