మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 01:44:25

నిష్కామ కవికి నీరాజనం

నిష్కామ కవికి నీరాజనం

ఏనొక మానవుండ చరియింతును సంఘమునందు ఐక్యమై

ఏనొక సోదరుండ భరియింతును తమ్ముల కష్టనష్టముల్‌

ఏనొక కర్మయోగినయి నిల్తును భాద్యత నిర్వహింపగన్‌

ఏనొక భారతీయుడ రచింతును ఉజ్వల భావి కావ్యముల్‌!

ఈ అక్షరాలు చదివాక ఏమనిపిస్తుంది? ఎవరీ కవి భాస్కరుడు? ఎంత విశాల మానస్తత్వమీ అక్షర ఋషిది అని అన్పించకుండా ఉండదు కదా! సాధారణంగా కవి జీవితానికి.. సాహిత్యానికి మధ్య అంతరం కనిపిస్తూ వుంటుంది. కానీ జీవితానికి సాహిత్యానికీ మధ్య సారూప్యతను, ఏకరూపతను సాధించిన అతి తక్కువ కవులలో చెప్పుకోదగిన కవి తిరునగరి. మట్టిని ప్రేమించినవాడు - మనిషిని గుండెలకు హత్తుకున్నవాడు.. మానవత్వాన్ని తన అక్షరాలతో నిరంతరం వెలిగించుకున్నవాడు తిరునగరి. మూలాల్ని మరువకుండా నడిచొచ్చిన తొవ్వను విడవకుండా పద్యమైనా, వచనమైనా, శతకమైనా, గేయమైనా సాహితీ ప్రక్రియలన్నిట్లో మనిషి తత్వానికి పట్టాభిషేకంచేసిన సహృదయ కవి ఆయన. ప్రాచ్య పాశ్చాత్య సిద్ధాంతాలను ఆపోశన పట్టిన ఈ కవికి మహాకవి దాశరథితో అవినాభావ సంబంధమున్నది. దాశరథి ప్రతి పద్యాన్ని, గేయాన్ని హృదయ జనరంజకంగా విన్పించేవారు తిరునగరి. దాశరథి వీరి భుజం తట్టి ప్రశంసించిన సందర్భాలు అనేకం. ఎన్నో సభల్లో వారితోపాటు కావ్యగానంచేసిన ఈ 75 యేండ్ల కవివర్యులు ఏనాడూ సన్మానాలు ఆశించలేదు. సాహిత్య వ్యవసాయాన్ని బాధ్యతగా ఇష్టంగా చేసే నిష్కామ మనస్వి. జానకి రామక్క, మనోహార్‌ దంపతులకు స్వాతంత్య్రానికి రెండేండ్ల ముందు భువనగిరి జిల్లా ఆలేరులో జన్మించిన తిరునగరికి ఆది నుంచి కష్టజీవి ఆటుపోట్లు తెలుసు. మధ్యతరగతి అనుబంధాలు, ఆత్మీయతల్ని నరనరాన జీర్ణించుకున్నా ఈ కవి తన ప్రతి అక్షరంలోనూ దాన్ని ప్రతిఫలింపజేశారు. శతకమైనా, వచనమైనా, పద్యమైనా తన ఎజెండా మానవుడే. జెండా మానవీయతే. 

‘బాలవీర’ శతకంతో రచనా వ్యాసాంగాన్ని మొదలెట్టి, ‘శృంగార నాయికలు’, ఖండకావ్యంతో తనలోని రసహృదయాన్ని ఆవిష్కరించి ‘వసంతం’ కోసం ఎదురుచూసి ‘కొవ్వొత్తి’లా కరిగి ‘అక్షరధార’గా ప్రవహించి ‘గుండెలోంచి’ ముక్తకాలుగా వెలువడి ‘మాపల్లె’ అందాలు వీక్షించి ‘మనిషికోసం’ వెతుకుతూ ‘వానా-వాడు’గా నిలబడి ‘ఈభూమి’ని వెతుకుతూ ‘ప్రవాహిని’గా ఉషోగీత పాడుతూ గత 60 ఏళ్లుగా సాహిత్య వ్యవసాయంచేస్తున్న మామూలు రైతు తిరునగరి.

‘ఒకింత మానవత’ కోసం ‘యాత్ర’లు చేస్తూనే ‘కొత్తలోకం’ వైపు కిటికీలోంచి చూస్తూ ‘సులువు మథనం’ చేసిన సవ్యసాచి లెక్చరర్‌గా రిటైరై అప్పుడే 17 ఏండ్లయింది. వీరి ‘తిరునగరీయం’ సమాజాన్ని విశ్లేషిస్తూ వచ్చిన ఎక్స్‌రే లాంటి పద్యకావ్యం అంటూ సినారే కొనియాడారు. ఈ కవి అజాత శత్రువు. ఏ సభకొచ్చినా ఎక్కడో ఓ మూల సాదాసీదాగా కూర్చోవటం-ఏ వ్యక్తి మాట్లాడినా ఆ మాటల్లోని మంచిని స్వీకరించి దగ్గరకెళ్లి భుజం తట్టి అభినందించడం ఆయనకు అలవాటు. గత పాతికేండ్లుగా వారిని నేను చూస్తున్నాను. పుస్తకాల్లోనే కాదు సభల్లోనూ  పత్రికల్లోనూ కూడా. ఎంత వినయంగా, వొద్దికగా వుంటారో అంత సూటిగా చెప్తారు. తన మనసులోని అంతర్మథనాన్ని. సమాజంపట్ల బాధ్యత- మనిషి బ్రతుకుపట్ల ఆవేదన  మారుతున్న విలువలపట్ల ఆవేశం  ముక్కలవుతున్న అనుబంధాలపట్ల ఆక్రోశం వారి మాటల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం దాశరథి పురస్కారం అందుకుంటున్న వీరు ‘నా తెలంగాణ కోటిరతనాల వీణ’ అన్న మాటని తలమీద పెట్టుకొని బతుకుతున్న నిజమైన తెలంగాణవాది.

తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో అనర్గళ పాండిత్యమున్న తిరునగరి ఇతర భాషా కవితలు, వ్యాసాలను ఎన్నింటినో అనువదించారు. గతంలో దాశరథి పురస్కారాన్ని పొందిన కూరెళ్ల విఠలాచార్య తిరునగరి పాండిత్యాన్ని ప్రశంసిస్తూ

‘తిరునగరి యన తియ్యని తెనుగుతేట

తిరునగరి యన ఉత్తమ దేశికుండ

తిరునగరి యన బహుముఖ ధీవరుండు

తిరునగరి యన కవికి ప్రతీకగాదె’ అంటారు.

ఎంతోమంది గొప్పగొప్ప వారితో కలిసి పంచుకున్న సభలు, కార్యగోష్టులు.. వాటిలో ఎన్నో అనుభవాలు.. మరెన్నో జ్ఞాపకాలు తిరునగరి గుర్తుచేసుకొంటుంటారు. ‘తిరులో సంప్రదాయాన్ని ‘నగరి’లో నాగరికతను దాచుకున్న ఉత్తమకవిగా’ తిరునగరిని ఆచార్య దివాకర్ల వెంకటావధాని అభివర్ణించారు. మహాకవి దాశరథికి కూడా తిరునగరిపట్ల ఎంతో అభిమానాన్ని ప్రదర్శించేవారు. 

‘తిరునగరి కవితలు తేజస్వంతములు ఓజస్వంతములు

They are throught proviking full of novality’ అంటూ కితాబులిచ్చారు.

దాశరథితో 300కి పైగా సభలు పంచుకున్నారు తిరునగరి. 1971లో యాదగిరిగుట్టలో ఓ సాహితీసభలో దాశరథి పద్యగానం చేస్తూ ‘నా గీతావళి ఎంతదూరం ప్రయాణంబగునో/అందాకా ఈ భూగోళంబున అగ్గివెట్టెదన్‌' అంటూ ఆగి నా పద్యాలన్నీ కంఠతావచ్చిన వ్యక్తి తిరునగరి ఒక్కరే అంటూ అందించవయ్యా అని అడగటం.. వెంటనే తిరునగరిగారు ‘నిప్పులు పోసి’ అంటూ ఆ పద్య భాగాన్ని కొనసాగించడం.. సభలో చప్పట్లు మారుమోగడం వెంటవెంటనే జరిగిపోయాయి. 1972లో ఒంగోలు సభలో తిరునగరిని వెంట తీసుకెళ్లిన దాశరథి ‘ఇదిగో ఈ కుర్రవాడి వాగ్ధార వినండి. నా తెలంగాణ బిడ్డ. అద్భుత వ్యక్తి’ అంటూ.. సినీనటుడు రాజబాబు, మహాకవి ఆరుద్ర, అనిశెట్టి, ఎల్లోరాల సాక్షిగా ఆ మహాసభలో తిరునగరిని గర్వంగా పరిచయం చేశారు. దాశరథి కవిత్వాన్ని ఔపోసన పట్టిన వీరికి దాశరథి పురస్కారం లభించడం నిజంగా అద్భుతం.

ఎవడి హృదయం / వెన్నమద్దంత మృదువుగా ఉంటుందో 

ఎవడు దుఃఖితుల కన్నీళ్ళు తుడుస్తూ / కన్నీరు కారుస్తాడో

వాడు కవి  రసరాజ్యానికి అధిపతి అన్నగల్గిన తిరునగరి ఏది చెప్పినా ముక్కుసూటిగా చెప్తాడు. భాష పట్ల తనకున్న పట్టును కవిత్వపు నగిషీగా అద్దుతాడు.

‘సంప్రదాయమెపుడు జాతికి రక్షణ

జాతికదిమి చూపు నీతి పథము

కాదు కూడదన్న లేదు భవిష్యత్తు

తిరునగరి మాట తిరుగులేదు’ అంటూ తిరునగరీయం ఐదు సంపుటాలలో హితబోధచేసే ప్రయత్నంచేశారు.

మనిషినెంతగా ప్రేమించారో మట్టినీ అంతగానే ప్రేమిం   చారు ఈ కవి. అడుగడుగునా తన మూలాల్ని వెతుక్కుంటూ దర్శనమిస్తాడు.

‘ఈ మట్టి నాకు దైవం/ఎందుకో తెలుసా

ఈ మట్టిని నమ్ముకున్న వాడిని మహత్ముణ్ణి చేసింది’ అంటూ మట్టిమీద మమకారాన్ని చాటుకున్నారు.

మానవత్వమంటే అక్షరాల్లో పొదగలేని మహాకావ్యం అనగల్గిన ఈ అక్షరబ్రహ్మ.. దాని గురించి ఎంత అందంగా చెప్పారో చూడండి.

మానవత్వాన్ని ప్రేమించడమంటే / మనిషిని ప్రేమించడమే

మానవత్వాన్ని వెల్గించటమంటే / మనిషిని వెలిగించడమే

ఎవరెన్ని గీతాలు పాడినా / మానవతా గీతమే మ్రోగుతుంది. అంటూ ముగిస్తారు.

‘నిన్నటి పీడకలల్ని మరిచిపోదాం/నేటి ఆమని మధురోహల్లో తేలిపోదాం

నిత్య చైతన్యశీలంతో జీవితాన్ని సాగిద్దాం/మనమంతా విశ్వమానవ కుటుంబంగా జీవిద్దాం’ అంటూ ఆశావాదంతో అక్షరాలు పేర్చి జగతిని జాగృతపరుస్తారు.

“ఈ ఉగాది వేళ / నీ ఊరికి దండం పెట్టు

నీ పల్లెపై పాటకట్టు/ మరిచిపోకు నేస్తం

ఆమనిలో నీ ఊరు అందాల జలతారు

అది నీ తల్లివేరు” అంటూ ఊరి వెలుగుల్ని పుస్తకాలనిండా పరుస్తారు. మన మూలాల్ని మళ్లీ గుర్తు చేస్తారు.

పద్యంద్వారా సంప్రదాయకతను, వచనం ద్వారా ఆధునికతను/ కవితా వస్తువులతో మానవీయతను అక్షరాల నిండా అర్థతను నింపి సాహిత్య వ్యవసాయం చేస్తున్న నిత్య కృషీవలుడు ఆయన, ఆరోగ్యం ఆటంకపరుస్తున్నా అక్షరం పట్ల ప్రేమతో భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ప్రతి కవిసమ్మేళనానికి ఎంతో ఉత్సాహంగా వస్తారు. మూడు తరాల కవులతో కరచాలనం చేసిన నిరంతర సృజనశీలి ఆయన. ఎక్కడా భేషజాలకు పోకుండా అందరిని ప్రోత్సహిస్త్తూ జీవనదిలా సాగటం తన ప్రత్యేకత. సామాన్యుడి జీవిత నేత్రాల నుంచి ప్రపంచాన్ని దర్శిస్తూ పద్యాన్ని తన చేతికర్రగా చేసుకుని సాహిత్యం ప్రస్థానం సాగిస్తున్న కవియోగి ఆయన! ఆయన అక్షరం నిత్య చైతన్యం.. ఆయన పద్యం నిత్యస్ఫూర్తిమంతం.

తిరునగరి రామానుజయ్యకు రాష్ట్ర ప్రభుత్వం 

దాశరథి పురస్కారం ప్రకటించిన సందర్భంగా

          - అయినంపూడి శ్రీలక్ష్మి, 99899 28562logo