మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 01:15:35

అగ్గువకే ఆర్టీసీ కార్గో

అగ్గువకే ఆర్టీసీ కార్గో

  • సరుకు రవాణాలో రైట్‌రైట్‌
  • ప్రైవేట్‌ కన్నా తక్కువ ధరలు 
  • ఏజెంట్ల నియామకంతో మరింత విస్త ృత సేవలు
  • పార్సిల్‌, కొరియర్‌ సర్వీసులతో సంస్థ ఆదాయం రెట్టింపు 
  • అంతర్రాష్ట్ర సర్వీసులు  పునరుద్ధరిస్తే మరింత ఊపు

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తొమ్మిది టన్నుల సామాను తీసుకుపోవాలనుకుంటే.. సాధారణ ప్రైవేటు కార్గో ఏజెన్సీలు కనీసంగా రూ.20 వేల - 25 వేల వరకు డిమాండ్‌ చేస్తాయి. దీనికి అదనంగా జీఎస్టీ, రూ.2 వేల హమాలీ చార్జీలు ఉంటాయి. పేరున్న కార్గో సంస్థలైతే.. ఏకంగా రూ.35-40 వేల వరకు డిమాండ్‌ చేస్తాయి. 

ఆర్టీసీ కార్గోలో టన్ను సామానును వంద కిలోమీటర్ల దూరానికి తీసుకువెళ్లేందుకు జీఎస్టీతో కలిపి రూ.824 వసూలు చేస్తారు. ఇందులోనే హమాలీ చార్జీలు కూడా రూ.200 కలిసే ఉంటాయి. ఈ చొప్పున విజయవాడకు లెక్కిస్తే... తొమ్మిది టన్నులకు గరిష్ఠంగా రూ.20,169 వరకు ఖర్చవుతుంది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఆర్టీసీ సరుకు రవాణా గాడిలో పడుతున్నది. తక్కువ ధరకే పీసీసీ (పార్సిల్‌-కొరియర్‌- కార్గో) సేవలను అందిస్తున్నది. వీటిద్వారా కరోనా కష్టకాలంలోనూ.. పార్సిల్‌, కొరియర్‌ సేవలో గతంకన్నా రెట్టింపు ఆదాయం ఆర్జించింది. గతంలో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా పార్సిల్‌ సేవలకు గాను నెలకు రూ.70 లక్షల ఆదాయం మాత్రమే వచ్చేది. నూతనంగా ప్రారంభించిన పార్సిల్‌ సర్వీసుల ద్వారా రోజుకు రూ. 4.70 లక్షలకు చేరడం విశేషం. ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్‌ సూచనతో పార్సిల్‌-కొరియర్‌-కార్గో (పీసీసీ) సేవల్లోకి అడుగుపెట్టిన సంస్థ ఇప్పుడిప్పుడే తన ఆదాయాన్ని పెంచుకుంటున్నది. సాధారణంగానైతే కరోనా కష్టకాలంలో అరకొర ఆదాయంతో కొట్టుమిట్టాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పీసీసీ సేవలు సంస్థకు స్వల్ప ఊరటనిస్తున్నాయి.  

ఊపందుకున్న పార్సిల్‌-కొరియర్‌

గతంలో ఆర్టీసీ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పార్సిల్‌-కొరియర్‌ సేవల్ని నిర్వహించేది. తద్వారా ఆర్టీసీకి నెలకు రూ.70 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ గత నెలలో సొంతంగా ఈ సేవల్ని నిర్వహిస్తుండగా.. తొలిరోజు రూ.15వేలతో మొదలైన ఆదాయం శుక్రవారం రూ.4.60 లక్షలకు చేరింది. ఈ సేవల్ని ప్రారంభించే ముందు అధికారులు ఏటా రూ.10-12 కోట్ల మేర ఈ సేవల నుంచి ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ ఆదాయం ఇప్పుడు రూ.16 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నది సుస్పష్టం. రాష్ట్రవ్యాప్తంగా 147 బస్‌స్టేషన్లలో పార్సిల్‌-కొరియర్‌ సేవలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ రంగంలో డోర్‌ డెలివరీకి ప్రాధాన్యం ఉన్న దరిమిలా ఆ మేరకు సంస్థ ఉద్యోగుల్ని ఈ సేవలకు వినియోగించాలని నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారితో సేవలను విస్తరిస్తున్నారు. ప్రధానంగా సామాన్య వ్యాపారులు, ప్రజలు ఆర్టీసీ పీసీసీ సేవలు వినియోగించుకునేందుకు యాప్‌తోపాటు సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి రావాల్సి ఉన్నది. ప్రధానంగా కార్గో సేవల్ని వ్యాపార పాయింట్ల వద్ద బుక్‌ చేసుకోవడం, పికప్‌-డెలివరీ పాయింట్లు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నది. ఇందుకోసం ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్లను నియమిస్తున్నారు. ఏపీతోపాటు బెంగళూరులో ఏజెంట్లను నియమించేందుకు చర్యలుచేపట్టారు.  

ఆర్టీసీ పీసీసీకి మంచి స్పందన

ఆర్టీసీ పార్సిల్‌-కొరియర్‌-కార్గో సేవలకు మంచి ఆదరణ ఉన్నది. ఇప్పటికే పార్శిల్‌-కొరియర్‌ ద్వారా రోజుకు నాలుగైదు లక్షల రూపాయల ఆదాయం వస్తున్నది. రోజుకు పది లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా కరోనా దరిమిలా నగరంలో బస్సులు నడకపోవడం, అంతర్రాష్ట్ర బస్సులు పునరుద్ధరణ కాకపోవడం వల్ల ఇంకా వేగంగా సేవల్ని ముందుకు తీసుకుపోలేకపోతున్నాం. బస్సుల పునరుద్ధరణ తర్వాత మెరుగైన ఆదాయాన్ని ఆర్జిస్తాం.

-పువ్వాడ అజయ్‌కుమార్‌, రవాణాశాఖ మంత్రి


logo