శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 17, 2020 , 15:35:09

చెక్ డ్యామ్ ల‌ నిర్మాణంతో పెరుగనున్న భూగర్భ జలాలు : మంత్రి ఎర్రబెల్లి

చెక్ డ్యామ్ ల‌ నిర్మాణంతో పెరుగనున్న భూగర్భ జలాలు : మంత్రి ఎర్రబెల్లి

జ‌న‌గామ : చెక్ డ్యామ్ ల‌తో అడుగంటుతున్న భూగ‌ర్భ జలాలు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని, దీంతో అటు రైతాంగానికి సాగునీరు, ఇటు ప్రజలకు మంచినీటి కొర‌త తీరుతుంద‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. జ‌న‌గామ జిల్లాలో మంజూరైన మొత్తం 18 చెక్ డ్యామ్ ల‌ను వెంట‌నే గ్రౌండ్ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే, కోలుకొండ‌, చౌడూరు మ‌ధ్య నిర్మించ‌నున్న చెక్ డ్యామ్ ని మంత్రి  ప‌రిశీలించారు. చెక్ డ్యామ్ నిర్మించే స్థల పరిశీలనలో  భాగంగా కోలుకొండ బ్రిడ్జి స‌మీపం నుంచి కిలోమీట‌ర్ కుపై గా కాలిన‌డ‌క‌న వెళ్ళారు. కొంత దూరం ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్ళారు. మ‌రికొంత దూరం న‌డిచారు. వెంట ఉన్న అధికారులు, స్థానిక  ప్రజాప్రతినిధులను సైతం ఆశ్యర్యానికి గురి చేస్తూ మంత్రి చెల‌క‌లు, పొలం గ‌ట్లు, వ‌ర‌ద‌, బుర‌ద‌ల్లో న‌డిచారు. ఆ వెంట‌నే ఆయ‌న సంబంధిత అధికారుల‌తో ఫోన్ లో మాట్లాడారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూ గ‌ర్భ జ‌లాలు పెర‌గ‌డానికి చెక్ డ్యామ్ లు ఉపయోగపడతాయన్నారు. చెక్ డ్యామ్ లు కరువు ప్రాంతాలకు వర ప్రదాయంగా ఉన్నాయన్నారు. వాగుల్లో నిర్మించే ఈ చెక్ డ్యామ్ లతో వాగుల్లో పారే నీటిని కొంత మేరకు నిలిపి ఉంచడం వల్ల ఆ చెక్ డ్యామ్ చుట్టుముట్టు కనీసం 250 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. జనగామ జిల్లాలో మొత్తం 18 చెక్ డ్యామ్ లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో జనగామ నియోజకవర్గంలో 7, ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో 5, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో 6 చెక్ డ్యామ్ లు నిర్మించనున్నట్లు వివరించారు.


అందులో ఒకటి పెద్ద వాగు పై నిర్మిస్తున్న చౌడూరు చెక్ డ్యామ్ అన్నారు.  ఈ చెక్ డ్యామ్ కు రూ.3 కోట్ల 9 లక్షల రూపాయలు మంజూరయ్యాయయని మంత్రి తెలిపారు. ఆయా చెక్ డ్యామ్ లను  ఈ నెలాఖరులోగా గ్రౌండ్ చేయాలని ఆ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.  మంత్రి ఎర్రబెల్లి వెంట సంబంధిత శాఖ అధికారులు, కోలుకొండ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.



logo