మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 23:12:00

కిర్లోస్కర్‌ కంపెనీకే మెకానిక్‌ పాఠాలు

కిర్లోస్కర్‌ కంపెనీకే మెకానిక్‌ పాఠాలు

పీవీ నరసింహారావుకు యంత్రాల మీద ఆసక్తి ఉండేది. చాలామందికి తెలియని మరో కోణం ఇది. పుస్తకం చూసి మోటార్‌ రిపేర్‌ చేసేవారట. స్వయంగా పీవీ సోదరుడే ఈ సంగతి తెలిపారు. మోటర్‌ రిపేరు చేయడమే కాకుండా కిర్లోస్కర్‌ కంపెనీకే మెకానిక్‌ పాఠాలు నేర్పారట. తొలిసారి మంథని ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం పీవీ తన స్వగ్రామం వంగరకు వెళ్లారు. ఓ రోజు మామిడితోటకు వెళ్లారు. అక్కడ కొత్తగా కొన్న కిర్లోస్కర్‌ ఆయిల్‌ ఇంజిన్‌ పనిచేయలేదు. ఎందుకిది ఇంతలా మొరాయిస్తున్నది? అని క్షుణ్నంగా పరిశీలించారు. మోటర్‌లో లూబ్రికేషన్‌ తక్కువగా ఉండటాన్ని గమనించారు. అందువల్లే మోటర్‌ తిరగటం లేదని గుర్తించారు. వెంటనే ఆ మోటార్‌ మొత్తాన్ని ఊడదీయించి కిరోసిన్‌లో బాగా ముంచారు. తిరిగి యథావిధిగా బిగించి నడిపించారు. అంతే మోటర్‌ అద్భుతంగా పరుగులు తీసింది. పీవీ అక్కడితో ఆ విషయాన్ని వదిలేయకుండా ఆ వ్యవహారాన్నంతా తెలుపుతూ కిర్లోస్కర్‌ కంపెనీకి లేఖ రాశారు. ‘మీ మోటర్‌లో లోపముంది. సెల్ఫ్‌ ల్యూబ్రికేషన్‌ సరిగా లేకపోవటం వల్ల ఇంత ఖరీదైన మోటర్‌ కొనుగోలుదారులకు నిరూపయోగం అవుతున్నది’ అని వివరించారు. తప్పును గుర్తించి తెలిపినందుకు కంపెనీ పీవీకి ధన్యవాదాలు తెలుపుతూ జవాబిచ్చింది.


logo