శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 00:45:18

వినూత్నంగా పత్తిసాగు

వినూత్నంగా పత్తిసాగు

 కొత్త ఆలోచనలతో ఐదెకరాల భూమిలో పలు రకాల పంటలు పండిస్తున్నాడు ఆ రైతు. ఒక్క సారి సాగు చేసి, రెండో సారి ఎలాంటి పెట్టుబడి లేకుండా వినూత్నంగా పత్తి సాగు చేస్తున్న   మారెడ్డి నర్సింహారెడ్డి పై ‘ఎవుసం’  కథనం.

సిద్దిపేట రూరల్‌ మండలం ఇర్కోడు గ్రామానికి చెందిన మారెడ్డి నర్సింహారెడ్డి కొత్త ఆలోచనలతో పత్తి పంట సాగు చేస్తున్నాడు. గత సంవత్సరం ఒక ఎకరం భూమిలో పత్తి పంట సాగు చేశాడు. అయితే గతంలో వేసిన పంటను నరికేయకుండా ఈ సంవత్సరం కూడా అలాగే ఉంచి, సాగు చేస్తున్నాడు.  పత్తి తీసిన తరువాత.. ప్రతి రైతూ వర్షాకాలం ప్రారంభంలో కానీ ఎండాకాలంలో కానీ ఎండిన చెట్లను తీసేసి, కాల్చి వేస్తాడు. కానీ నర్సింహారెడ్డి మాత్రం అలా చేయకుండా రోహిణి కార్తె కంటే ముందు.. ప్రతి పత్తి చెట్టును ఒకటిన్నర అడుగు పైన కత్తిరించి అలాగే ఉంచాడు. దీంతో ఇగురు వేసిన పత్తి చెట్లకు ఎరువులు వేయడంతో పాటు.. కలుపు, పిచికారీ లాంటి తగు జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఇప్పుడు మామూలు పత్తిలానే పెరిగి పూత దశనుంచి కాత దశకు చేరింది. పంటలో ఎలాంటి మార్పూ లేకుండా చెట్టు ఎదిగింది.

సమయం, పెట్టుబడి ఆదా

ఇలా పత్తి సాగు చేయడం వల్ల పెట్టుబడితో పాటు చాలా సమయమూ ఆదా అవుతుంది. దున్నకాల ఖర్చు, విత్తనాలు, ఎరువులు.. ఇలా చాలా రకాలుగా కలిసివస్తుంది. దీనిని జీరో బేస్డ్‌ వ్యవసాయంగా చెప్పవచ్చు. పెట్టుబడి లేకుండా సేద్యం చేయడాన్నే.. జీరో బేస్డ్‌ వ్యవసాయంగా నిర్వచిస్తారు. వ్యర్థాలను ఉపయోగించుకొని పంటలో మార్పు లేకుండా వీలైనంత మేరకు దిగుబడి సాధించడం అన్నది పలువురికి ఆదర్శమని చెప్పాలి. నీళ్ల వసతి ఎక్కువగా లేని వాళ్లకు ఇది మరింత ప్రయోజనకరం. ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ద్వారా పత్తి పంటను సాగు చేసుకోవాలని చెప్పడంతో.. ఇలా వినూత్నంగా సాగు చేస్తే రైతులకు ఎంతో లాభదాయకమని  అధికారులు చెబుతున్నారు. నా సొంత ఆలోచనతోనే.. గతంలో మల్బరీ, పొద్దు తిరుగుడు లాంటి పంటలు సాగు చేసిన. మల్బరీ సాగు పద్ధతినే పత్తిలో అనుసరిద్దామని ఇలా చేసిన. తక్కువ రోజుల్లో పంట చేతికస్తది. మొన్నటిసారి పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారి ఇలా చేయడం వల్ల పంట దిగుబడి బాగానే వస్తుందని ఆశిస్తున్న.                           

- మారెడ్డి నర్సింహారెడ్డి (రైతు) 


logo