శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 13:22:12

సీఎం కేసీఆర్ కు కరోనా అంటూ తప్పుడు వార్త..కేసు నమోదు

సీఎం కేసీఆర్ కు కరోనా అంటూ తప్పుడు వార్త..కేసు నమోదు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు కరోనా అంటూ తప్పుడు వార్తలు రాసిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేకరి ఆనం చిన్ని వెంకటేశ్వర రావుతో పాటు పత్రిక యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఈ పేపర్ లో రెండు రోజుల క్రితం "సీఎం కేసీఆర్ కి కరోనా" ."హరితహారం కార్యక్రమంలో సోకిందా" అంటూ వార్త ప్రచురించిన విషయాన్ని రహమత్ నగర్ లో నివాసం ఉంటున్న మహ్మద్ ఇలియాస్ అనే టీఆర్ఎస్ కార్యకర్త చూశాడు.  సీఎం కేసీఆర్ జలుబు తదితర లక్షణాలతో బాధపడుతున్నాడని, క్వారన్ టైన్ లో చికిత్స అని, ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా అంటూ వార్త రాయడంతో షాక్ కి గురైన ఇలియాస్ తన స్నేహితులతో వాకబు చేశారు. ఇలాంటి వార్త ఏది అధికారులు ధ్రువీకరించలేదని, తప్పుడు వార్త కావొచ్చు అని వారు చెప్పారు.

దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ఆందోళన కలిగించే కుట్రకు పాల్పడిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఎడిటర్, యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఇలియాస్ ఆదివారం రాత్రి జూజ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేఖరి వెంకటేశ్వరరావుతో పాటు యాజమాన్యంపై ఐపీసీ 505(1)(b), 505(2) రెడ్ విత్34 సెక్టన్లతో పాటు 54 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


logo