శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 17:15:14

బాసరలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవం

బాసరలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవం

నిర్మల్‌  : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆదివారం గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మూడ్రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు కరోనా కారణంగా ఈ ఏడాది ఒక్కరోజుతోనే ముగించేశారు. ఈ సారి వేద పండితులకు సన్మాన కార్యక్రమాలు రద్దు చేశారు. ఆలయంలో వేద పండితులు, అర్చకులు వేకువ జామున నుంచి చతుర్వేద సహిత సరస్వతీ యాగం, చంఢీ హోమం నిర్వహించారు. వేద మహార్షి ఆలయంలో ఆలయ ఈవో దంపతులు పట్టు వస్ర్తాలను సమర్పించారు. 

పండితులు వేద ఉపనిషత్తుల పారాయణం నిర్వహించారు. కొద్ది మంది స్థానికులు, ఆలయ పండితులు మాత్రమే పాల్గొన్నారు. అమ్మవారిని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య నిర్మల్‌ అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసరావు, తదితరులు వేర్వేరుగా దర్శించుకున్నారు. కాగా అమ్మవారికి దాదాపు రూ. 75వేల విలువైన 112 కిలోల ఇత్తడి విజయ గంటను ఆలయంలో పూజారిగా పని చేసే రాజేశ్వర్‌ శ్రోతి కుటుంబ విరాళంగా అందించారు. 




logo