శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 04:25:13

పంద్రాగస్టుకు టీకా!

పంద్రాగస్టుకు టీకా!

తయారీకి గడువు నిర్దేశించిన ఐసీఎంఆర్‌

తెలంగాణ నుంచే తొలి వ్యాక్సిన్‌?

8 నుంచి  హ్యూమన్‌ ట్రయల్స్‌.. దేశంలో 12 కేంద్రాల ఎంపిక

హైదరాబాద్‌లో నిమ్స్‌, విశాఖలో కేజీహెచ్‌

అన్ని కేంద్రాలకు నోడల్‌ అధికారుల నియామకం

ప్రయత్నాలు ముమ్మరం చేసిన భారత్‌ బయోటెక్‌

ఆరు నెలలుగా యావత్‌ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారికి కళ్లెం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న జనావళికి విజయంపై ఆశలు చిగురుస్తున్నాయి. కొవిడ్‌ను నియంత్రించే టీకా మందు తయారీ కోసం ప్రముఖ దేశాలన్నీ ప్రయత్నిస్తుండగా, తొలి టీకా పోటు పొడిచేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ‘కొవాగ్జిన్‌' వ్యాక్సిన్‌ ఇప్పటికే జంతువులపై సత్ఫలితాలనిచ్చింది. మరో రెండు రోజుల్లో దీనిని మనుషులపై ప్రయోగించనున్నారు. ఈ పరీక్షలు కూడా సఫలమైతే పంద్రాగస్టు భారత్‌తోపాటు ప్రపంచమంతటికీ పండుగ కానున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారితో గజగజలాడుతున్న ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం పంద్రాగస్టు కానుకనివ్వబోతున్నది. కోటిమందికి పైగా సోకి ఐదులక్షలకుపైగా మందిని బలిగొన్న వైరస్‌ను కట్టడిచేసే తొలి సంజీవనిని హైదరాబాద్‌ అందివ్వబోతున్నది. ఇందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళిక ప్రకారం హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్‌' టీకా మందును ఆగస్టు 15న విడుదలచేసేందుకు రంగం సిద్ధం అవుతున్నది. ఈ మేరకు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న దవాఖానలు, వైద్య సంస్థలకు రాసినలేఖ శుక్రవారం మీడియా చేతికి అందింది. ఇదే నిజమైతే కరోనా రక్కసి అంతం కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు మరో నెలన్నరలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఐసీఎంఆర్‌, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌' టీకామందును అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా విజృంభణ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అనుమతులు, పరీక్షలను వేగవంతంగా పూర్తిచేయాలని బలరాం భార్గవ్‌ కోరారు. ‘బీబీవీ152 కొవిడ్‌ వ్యాక్సిన్‌' (కోవాగ్జిన్‌) క్లినికల్‌ ట్రయల్స్‌కు ఈ నెల 7వ తేదీలోగా అన్ని అనుమతులు పొందాలని ఆదేశించారు. ఆ వెంటనే పరీక్షలు ప్రారంభించి, త్వరగా పూర్తిచేసి ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధం కావాలని సూచించారు. ‘కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకురావడంలో భాగంగా క్లినికల్‌ ట్రయల్స్‌ను వేగవంతం చేయడానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌తో కలిసి పనిచేస్తున్నాం. దేశీయంగా తయారవుతున్న తొలి వ్యాక్సిన్‌ ఇది. దీనిని భారత ప్రభుత్వంలోని అత్యున్నతస్థాయి వర్గాలు అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని పర్యవేక్షిస్తున్నాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ను త్వరితగతిన పూర్తిచేసి ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడానికి కృషి చేయాలి. 

భారత్‌ బయోటెక్‌ ఈ దిశగా పనిచేస్తున్నది. అయితే ఈ ప్రాజెక్టులో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్న అన్ని చోట్ల నుంచి సరైన సహకారం అందడంపైనే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఆధారపడి ఉంటుంది. క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించడానికి అవసరమైన అన్ని అనుమతులను పొందే ప్రక్రియను వేగవంతం చేయాలి’ అని భార్గవ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. అందువల్ల ఈ ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి గడువులోగా ట్రయల్స్‌ పూర్తిచేయాలని నిర్దేశించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2కు సంబంధించి డీసీజీఐ ఇప్పటికే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. మరో నెలన్నర రోజుల్లో పరీక్షలు పూర్తయితే.. ప్రపంచంలో అందుబాటులోకి రానున్న తొలి కరోనా వ్యాక్సిన్‌ ఇదే కానున్నది. అయితే ఈ లేఖ పూర్తిగా అంతర్గతమని, గడువుపై ఇప్పుడే స్పందించలేమని భారత్‌ బయోటెక్‌ వర్గాలు తెలిపాయి. ఆ లేఖ తాము రాసిందేనని ఐసీఎంఆర్‌ ప్రతినిధి రజనీకాంత్‌ శ్రీవాస్తవ స్పష్టంచేశారు. 

మనుషులపై ప్రయోగాలు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తేనే వ్యాక్సిన్‌ను బహిరంగ మార్కెట్లో విడుదల చేస్తామని ఐసీఎంఆర్‌కు చెందిన ఒక శాస్త్రవేత్త పేర్కొన్నారు. మనుషులపై ప్రయోగాల కోసం ఐసీఎంఆర్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా 12 కేంద్రాలను ఎంపికచేసింది. ఇందులో తెలంగాణ నుంచి హైదరాబాద్‌కు చెందిన నిమ్స్‌ దవాఖాన, ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖపట్నంలోని కేజీహెచ్‌ ఉన్నాయి. ఎంపికచేసిన 12 సెంటర్లలో ట్రయల్స్‌ ఆగస్టు మొదటి వారానికి పూర్తి అవుతాయని భావిస్తున్నారు. ప్రయోగాలను వేగవంతం చేసే క్రమంలో ఐసీఎంఆర్‌ నోడల్‌ ఆఫీసర్లను నియమించింది. నిమ్స్‌ దవాఖాన నోడల్‌ ఆఫీసర్‌గా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డిని నియమితులయ్యారు. ఏపీలోని కేజీహెచ్‌ దవాఖాన నోడల్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ వాసుదేవ్‌ వ్యవహరిస్తారు. 

ఐసీఎంఆర్‌ ఎంపిక చేసిన కేంద్రాలు

నిమ్స్‌- హైదరాబాద్‌, కేజీహెచ్‌-విశాఖపట్నం (ఏపీ), పండిత్‌ భాగవత్‌ దయాల్‌ శర్మ వర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌-రోహ్‌తక్‌ (హర్యానా), ఎయిమ్స్‌-న్యూఢిల్లీ, ఎయిమ్స్‌-పాట్నా (బీహార్‌), గిల్లుర్కర్‌ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌-నాగపూర్‌ (మహారాష్ట్ర), రాణా హాస్పిటల్‌-గోరఖ్‌పూర్‌ (యూపీ), ఎస్‌ఆర్‌ఎం మెడికల్‌ కాలేజ్‌-చెంగల్పట్టు (తమిళనాడు), ఐఎంఎస్‌&ఎస్‌యూఎం హాస్పిటల్‌-భువనేశ్వర్‌ (ఒడిశా), ప్రఖార్‌ హాస్పిటల్‌-కాన్పూర్‌ (యూపీ), రెడ్కార్‌ హాస్పిటల్‌- గోవా. 

రెండ్రోజుల్లో క్లినికల్‌ ట్రయల్స్‌

సోమవారం ఆరోగ్యవంతుల ఎంపిక

నేడు ఎథిక్స్‌ కమిటీ భేటీ: నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ 

ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  కరోనా వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ కోసం హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమైన నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) ఎంపికైంది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌' టీకాను మనుషులపై ప్రయోగించేందుకు దవాఖాన యాజమాన్యం ఏర్పాట్లు చేస్తున్నది. నిమ్స్‌లో కొవాగ్జిన్‌ టీకాపై మరో రెండు రోజుల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తామని సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ చెప్పారు. ఆయన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుసరించాల్సిన విధానాన్ని ఖరారు చేయడానికి ఎథిక్స్‌ కమిటీ శనివారం సమావేశం కానుందని తెలిపారు. ‘ఎథిక్స్‌ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ఖరారు చేసిన మార్గదర్శకాలను ఢిల్లీలోని ఐసీఎంఆర్‌కు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తాం. ఐసీఎంఆర్‌ దానికి సమ్మతించగానే రెండురోజుల్లోనే క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభిస్తాం. ఎంపికచేసిన వ్యక్తులకు సోమవారం స్క్రీనింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. మంగళవారం లేదా బుధవారం ట్రయల్స్‌ మొదలు కావచ్చు. అన్ని రకాలుగా పరీక్షలు నిర్వహించి బాగా ఆరోగ్యంగా ఉన్న వారిని ఎంచుకుని క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తాం. మొదట ఎంపికచేసిన వ్యక్తులకు ‘కొవాగ్జిన్‌' డోస్‌ను ఇచ్చి 24గంటల పాటు దవాఖానలోనే పరిశీలనలో ఉంచుతాం. మంచి ఆహారం ఇవ్వడంతోపాటు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకొని సదరు వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. తర్వాత ఇంటికి పంపి 14రోజుల వరకు పరిశీలనలో ఉంచుతాం. ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకొని పరిస్థితిని సమీక్షిస్తాం. వ్యాక్సిన్‌ వల్ల యాంటీబాడీలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో పరిశీలిస్తాం. ఆ నివేదికను ఐసీఎంఆర్‌కు పంపుతాం. తర్వాత రెండో దశలో మరో 14రోజులపాటు ఇదే తరహాలో వ్యాక్సిన్‌ డోస్‌ ఇచ్చి రోగ నిరోధక శక్తి ఏ మేరకు పెరుగుతుందో పరిశీలిస్తాం. దేశవ్యాప్తంగా 375మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగనున్నాయి. మానవాళి మనుగడకు అత్యంత అవసరమైన ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం చకాచకా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని చెప్పారు. 

గడువు.. తొందరపాటు

పంద్రాగస్టు నాటికి కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసేందుకు ఐసీఎంఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు వాస్తవరూపం దాల్చకపోవచ్చని నిపుణులు అనుమానం వ్యక్తంచేశారు. ‘సాధారణంగా ఏ వ్యాక్సిన్‌కైనా మనుషులపై ప్రయోగం విజయవంతమైన తరువాత 12 నుంచి 15 నెలల అనంతరం దానిని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అనుమతి లభిస్తుంది. కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ప్రభుత్వానిది తొందరపాటే అవుతుంది’ అని మణిపాల్‌లోని కస్తుర్బా మెడికల్‌ కాలేజీ, ఫోరెన్సిక్‌ విభాగానికి చెందిన అనంత్‌భాన్‌ పేర్కొన్నారు. ఓ వ్యాక్సిన్‌ తయారీకి వేగవంతమైన ప్రక్రియను అనుసరించడం మునుపెన్నడూ జరుగలేదని తెలిపారు. హడావుడిగా చేపట్టే ఈ ప్రక్రియ వెనుక ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు. ‘ఓ వైపు క్లినికల్‌ ట్రయల్స్‌కు ముందు జరుగాల్సిన ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు. మరోవైపు జూలై 7నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం మనుషులను ఎంపిక చేస్తామంటున్నారు. ఇదెలా సాధ్యం?’ అని ప్రశ్నించారు.


logo