బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 14:57:55

రైతుబంధు రాకుంటే అధికారులపై చర్యలు : మంత్రి నిరంజన్ రెడ్డి

రైతుబంధు రాకుంటే అధికారులపై చర్యలు : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : రైతు బంధు పథకం కింద అర్హత ఉండి రైతుబంధు రాకపోతే.. సంబంధిత అధికారులపై చర్యలు చేపడుతామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 55 లక్షల ఐదు వేల మంది రైతులకు సంబంధించిన కోటి 40 లక్షల ఎకరాల భూమికి వర్తించే విధంగా ఏడు వేల కోట్ల రూపాయలను  సంబంధిత రైతుల ఖాతాలలో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మండలం, మదనపూర్, అడ్డాకుల మండలాల్లోని పలు గ్రామాల్లో  రైతు వేదికల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగామంత్రి మాట్లాడుతూ కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించి పోయిందన్నారు. అయినప్పటికీ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ రైతులకు ఇబ్బందులు కలగకుండా.. రైతుబంధు కింద రైతు ఖాతాలలో నగదు వేశారని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 55 లక్షల 5 వేల మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేయగా, ఇంకా రైతుబంధు రావాల్సిన వారు నాలుగు లక్షల పైన ఉన్నారని తెలిపారు .పేర్లు సరిగా లేకపోవడం, బ్యాంకు ఖాతాలు తెరవకపోవటం వంటి కారణాల వల్ల వీరికి రైతుబంధు జమ కాలేదని తెలిపారు.

 అయితే న్యాయబద్ధంగా రైతు బంధుకు అర్హత ఉండి రానట్లైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా వారి పరిధిలోని ఐదు వేల ఎకరాలకు సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని, రైతుల సమాచారంతో సేకరిస్తామని తెలిపారు. రైతులు ఎప్పటిలాగే సాధారణ పంటలు సాగు చేయకుండా వాణిజ్య పంటల పై దృష్టి సారించాలని, ముఖ్యంగా కూరగాయలు సాగు చేయాలని సూచించారు. హరితహారం అందరూ మొక్కలు నాటాలని సూచించారు. 


logo