శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 13:40:12

హరితహారంతో వెల్లివిరుస్తున్న పచ్చదనం : మంత్రి అల్లోల

హరితహారంతో వెల్లివిరుస్తున్న పచ్చదనం : మంత్రి అల్లోల

యాదాద్రి భువనగిరి : అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్  తెలంగాణ‌కు హ‌రిత‌హారం అనే మహోత్తర కార్యక్రమాన్ని చేప‌ట్టారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని రాయిగిరిలో ఆంజనేయ అరణ్యం, నర్సింహా అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో  కలిసి  మంత్రి ప్రారంభించారు. ఆంజనేయ అరణ్యంలో కాలి నడకన తిరుగుతూ సందర్శకుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలు, పునరుద్ధరించిన అటవీ ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితోద్యమ కార్యక్రమాన్ని చేపట్టారని, దీంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే..మరోవైపు అడవులను కాపాడుకునేందుకు అత్యంత క‌ఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా హైద‌రాబాద్ న‌లువైపులా, ఇత‌ర పట్టణాలకు దగ్గర్లో ఉండే అటవీ భూములను గుర్తించి వాటిలో కొంత భాగాన్ని అర్బన్ లంగ్‌ స్పేస్‌లుగా, అర్బన్ ఫారెస్ట్ పార్కు లు, ఎకో టూరిజం పార్కుల‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రీశుడి క్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుండ‌టంతో  ఇక్కడికి వ‌చ్చే యాత్రికుల‌‌తో పాటు ఈ ప్రాంత ప్రజలకు ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని అందించాల‌నే ఉద్దేశంతో రాయ‌గిరి రిజ‌ర్వు ఫారెస్ట్ బ్లాక్ లో  న‌ర్సింహా అర‌ణ్యం, అంజ‌నేయ అర‌ణ్యం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ల‌ను అభివృద్ధి చేశామన్నారు. 

 రాయ‌గిరి - II రిజ‌ర్వు ఫారెస్ట్ బ్లాక్ లో  97.12 హెక్టార్లలో రూ.3.61 కోట్ల వ్యయంతో న‌ర్సింహా అర‌ణ్యం, రాయ‌గిరి -I ‌రిజ‌ర్వు ఫారెస్ట్ బ్లాక్ లో  56.65 హెక్టార్లలో రూ.2.83 కోట్ల వ్యయంతో అంజ‌నేయ‌ అర‌ణ్యం అర్బన్ ఫారెస్ట్ పార్కుల‌ను  స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దారన్నారు. పిల్లలు పర్యావరణం, అడవుల ప్రాధాన్యతను గుర్తించేలా, వీటిపై అవగాహన కల్పించేలా ఈ పార్కులను రూపుదిద్దారని తెలిపారు.  ఆంజనేయ అరణ్యంలోని  జలపాతానికి యాదమునికి  గుర్తుగా యాదాశ్రీ  అని పేరు పెట్టినట్లు వివరించారు.   కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్. శోభ, అదనపు  పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, చంద్రశేఖర్ రెడ్డి, డీఎఫ్ వో డీవీ రెడ్డి,  ఏసీఎఫ్ శ్రీనివాస్, స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo