మంగళవారం 07 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 13:57:56

తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే

తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే

వనపర్తి : ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా 36 గంటల్లో రైతులకు రూ.7వేల కోట్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగో విడత రైతుబంధు ద్వారా ఇప్పటి వరకు 55 లక్షల 6వేల మందికి  రైతుబంధు సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇతం పెద్ద మొత్తంలో రైతులకు ఆర్థిక స్వాబంలన కల్పించినందుకు రాష్ట్ర రైతాంగం తరుఫున సీఎం కెసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాని చెప్పారు.

ఆకలిదప్పుల తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కెసీఆర్‌ దక్కుతుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కోటి 50లక్షల ఎకరాల సాగు భూమికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 28వేల ఖాతాల రైతులకు రైతుబంధు సహాయం ఖాతాల వివరాలు సరిగ్గా లేనందున పంపిణీ చేసిన నగదు వాపస్‌ వచ్చిందని మంత్రి తెలిపారు.

 రైతుబంధు పొందని రైతులందరు తమ ఖాతాల వివరాలను పేర్లను, సరిచేసి సంబందిత వ్యవసాయ అదికారులకు అందించి రైతుబంధు సహాయాన్ని పొందాలని సూచించారు.రైతుబంధు సహాయం రైతులకు అందేందుకు కృషి చేసిన వ్యవసాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు, సిబ్బందికి మంత్రి నిరంజన్‌ రెడ్డి అభినందనలు తెలియజేశారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్లు , టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 



logo