సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 13:18:07

కోతిని ఉరితీసిన గ్రామస్తులు

కోతిని ఉరితీసిన గ్రామస్తులు

  • ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెంలో ఘటన


ఖమ్మం : కేరళలో గర్భవతి అయిన ఏనుగుకు పేలుడు పదార్థాలు తినిపించిన ఘటన మరువక ముందే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఓ అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. మూగ జీవాలపై మానవుల క్రూరత్వానికి ఈ సంఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. కోతిని చెట్టుకు ఉరి వేసి చంపిన హృదయవిదారక ఘటన ఖమ్మం జిల్లాలోని అమ్మపాలెం గ్రామంలో జరిగింది. 

కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున కోతులు తిరుగుతుండేవి. కోతుల దండు మూకుమ్మడిగా తిరుగుతూ శబ్దాలతో ప్రజలు, రైతులను భయపెడుతుండేవి. ఈ క్రమంలో ఓ కోతి నీరు తాగేందుకు రాగా.. దాన్ని ఓ గ్రామస్తుడు పట్టుకొని  ఊర్లోకి తీసుకెళ్లి చెట్టుకు ఉరి వేశాడు. బాధతో ఆ కోతి గిలా గిలా కొట్టుకొని ప్రాణాలు వదులుంతుండగా.. కొందరు గ్రామస్తులు దాని చుట్టూ కర్రలతో నిలబడి సంబురాలు జరుపుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 


అనంతరం చనిపోయిన కోతి కలేబరాన్ని కుక్కలకు వేశారు. దీంతో కోతులు, కుక్కలు పెద్దఎత్తున గుమిగూడి జనాన్ని దగ్గరికి రానీయకుండా పెద్దగా అరుపులు, కేకలు వేశాయి. కోతి కలేబరాన్ని ఇతర కోతులు తీసుకెళ్లి ఐకమత్యాన్ని చాటాయి. ఈ విషయమై జంతు ప్రేమికులు సదరు గ్రామస్తులపై పోలీసులకు పిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి వారిని  అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. logo