ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 14:53:54

ఆధునిక సౌకర్యాలతో మహబూబ్ నగర్ లో వైద్య సేవలు

ఆధునిక సౌకర్యాలతో మహబూబ్ నగర్ లో  వైద్య సేవలు

మహబూబ్ నగర్ : భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు వైద్యం కోసం హైదరాబాదు లాంటి మహా నగరాలకు వెళ్లకుండా స్థానిక ప్రభుత్వ జనరల్ దవాఖానలోనే అత్యాధునిక వైద్య సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 20 యూనిట్ల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో జిల్లా దవాఖానలో కేవలం18 మంది డాక్టర్లు, 70 మంది నర్సులు మాత్రమే ఉండే వారని, ఇప్పుడు ఆ సంఖ్య 200 మంది డాక్టర్లు, 500 మంది నర్సులకు పెరిగిందన్నారు. అంతేకాక ల్యాబ్ టెక్నీషియన్లు, సిబ్బంది, 24 గంటల అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. సాధారణ రోగాలకు చికిత్స తో పాటు, క్యాన్సర్ వంటి జబ్బులకు సైతం చికిత్స అందిస్తున్నామని తెలిపారు.


ప్రభుత్వ వైద్య కళాశాలలో రూ.475 కోట్లతో పనులు జరుగుతున్నాయని, భవిష్యత్తులో జిల్లా ప్రజలు ఎవరు కూడా వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే అత్యాధునిక సౌకర్యాలతో చికిత్స అందే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అయితే జిల్లా ప్రధాన ఆసుపత్రి తో పాటు మెడికల్ కళాశాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు, కొరత రాకుండా చూడాలని, ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా నిర్లక్ష్యం వహించరాదని, విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

 ఉస్మానియా, గాంధీ దవాఖాన స్థాయిలో ప్రస్తుతం మహబూబ్ నగర్ ప్రభుత్వ దవాఖానలో 900 పడకలు, 30 ఐ. సి.యు యూనిట్లు ఉన్నాయని, అందువల్ల ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్ లాల్, మున్సిపల్ చైర్మన్ నరసింహులు, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు లయన్ నటరాజ్, కౌన్సిలర్లు తదితరులున్నారు.logo