మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 16:45:11

విదేశీ బొగ్గు వద్దు..స్వదేశీ బొగ్గు ముద్దు

విదేశీ బొగ్గు వద్దు..స్వదేశీ బొగ్గు ముద్దు

హైదరాబాద్ : విదేశీ బొగ్గు దిగుమతికి బదులుగా స్వదేశీ బొగ్గు వినియోగం బాగా పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు.. సింగరేణి సంస్థ తన అధికారిక వెబ్‌ సైట్‌ లో ఒక ప్రత్యేక పోర్టల్‌ ను ప్రవేశపెట్టింది. సంస్థ డైరెక్టర్‌ (ప్లానింగ్‌ అండ్ ప్రాజెక్ట్స్‌)  బి.భాస్కర్‌ రావు, డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌ అండ్ ప్లానింగ్‌ ) ఎస్‌.చంద్రశేఖర్‌  దీనిని ప్రారంభించారు. విదేశీ బొగ్గు వినియోగం తగ్గించడానికి ప్రత్యమ్నాయంగా స్వదేశీ బొగ్గు వాడకాన్ని పెంచడం కోసం, వినియోగదారులకు అనుకూలమైన, స్నేహపూర్వకమైన వ్యాపార లావాదేవీల కోసం ఈ పోర్టల్‌ ను ప్రారంభించామని వెల్లడించారు. ఇప్పటికే సింగరేణితో కోల్‌ లింకేజీ ఉన్న కస్టమర్లతో పాటు, లింకేజీ లేని కస్టమర్లు కూడా తమకు అవసరమైనప్పుడు బొగ్గును అవసరమైనంత పరిమాణంలో పొందడానికి వీలు కల్పిస్తున్నామన్నారు.

సింగరేణిలో గల రైల్‌, రోడ్‌ లోడింగ్ పాయింట్లలో ఎక్కడినుండి అయినా సరే బొగ్గు పొందడానికి వినియోగదారులకు అవకాశం కల్పిస్తున్నామని డైరెక్టర్లు తెలిపారు. సింగరేణి సంస్థ వినియోగదారుల అభీష్టం మేరకు నాణ్యతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, వారికి కావాల్సిన పరిమాణంలో బొగ్గును సరఫరా చేయడానికి సంసిద్ధంగా ఉందన్నారు. ఈ పోర్టల్‌ కు సంబంధించిన వివరాల కోసం www.scclmines.com సందర్శించాల్సిందిగా మార్కెటింగ్‌ శాఖ వారు కోరారు. ఏవైనా సందేహాలు ఉన్నచో 040-23142219 ను సంప్రదించవచ్చని వారు తెలియజేశారు.


logo