గురువారం 02 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 15:51:39

ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ : గ్రామాల్లో రైతులు పండించిన పంటను రోడ్లపై నూర్పిడి చేయకుండా కల్లాలు నిర్మించుకోవడానికి సీఎం కేసీఆర్‌ రూ.750 కోట్లు మంజూరు చేశారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కల్లాల చొప్పున నిర్మించుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని బోంరాస్ పేట మండల కేంద్రంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించే రైతు వేదిక భవన నిర్మాణానికి కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో రైతులను సంఘటితం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. 

రైతు వేదిక పేరుతో రైతులకు ఒక భవనాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని, వీటి నిర్మాణానికి రూ.22 లక్షలు వ్యయం చేస్తున్నామని చెప్పారు. రైతు వేదిక భవనాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సబిత అధికారులను ఆదేశించారు.  ఒక్క రైతు నష్టపోకుండా రైతుబంధు పథకం కింద ప్రతి రైతుకు లాగొడి సహాయం అందిస్తామని, జిల్లాలో కొత్తగా 2 వేల మందికి, మండలంలో 1100 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయని వీరందరికీ రైతుబంధు సహాయం అందిస్తామని మంత్రి చెప్పారు. రైతు వేదిక నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన మాజీ సర్పంచ్‌ బాబూరావును మంత్రి, ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. 


logo