మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 18:26:48

పది రోజుల్లో రైతుబంధు : సీఎం కేసీఆర్

పది రోజుల్లో రైతుబంధు : సీఎం కేసీఆర్

  • నియంత్రిత సాగుకు రైతుల నుంచి వంద శాతం మద్దతు
  • ఇప్పటికే 11 లక్షల ఎకరాల్లో విత్తనాలు
  • వారం పది రోజుల్లో రైతుబంధు డబ్బులు
  • యాసంగి పంటల కోసం కూడా వ్యవసాయ ప్రణాళిక!

హైదరాబాద్‌ : ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నియంత్రిత పద్ధతిలో పంటసాగు చేయడానికి సిద్ధపడిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పంటల సాగు పరిస్థితిపై సీఎం సమీక్షించారు. జిల్లాల వ్యవసాయ అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన విధంగానే అన్ని జిల్లాల్లో రైతుల పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 11 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రైతుల నుంచి వందకు వంద శాతం మద్దతు లభించింది. రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడం  హర్షణీయమని సీఎం అన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించిందని సీఎం తెలిపారు. 

రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున వెంటనే రైతులందరికీ రైతుబంధు సాయం అందించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని, రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడొద్దు అని సీఎం సూచించారు. వారం పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. రైతుబంధు డబ్బులు ఉపయోగించుకుని వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని చెప్పారు. వర్షాకాలం పంటల కోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే యాసంగి పంటల కోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 



logo