బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 18:05:10

కవిత చొరవ.. సౌదీ నుంచి ఆర్మూర్‌కు చేరుకున్న రవి

కవిత చొరవ.. సౌదీ నుంచి ఆర్మూర్‌కు చేరుకున్న రవి

హైదరాబాద్‌ : ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ నిరుపేద యువకుడిని.. అక్కడి యజమాని తీవ్ర వేధింపులకు గురి చేశాడు. రక్తం వచ్చేలా ఆ యువకుడిని కొట్టాడు. యజమాని చేతిలో చావు దెబ్బలు తిన్న ఆ యువకుడు.. మాజీ ఎంపీ కవిత చొరవతో బతికి బయటపడ్డాడు. 

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామానికి చెందిన అంకమొల్ల రవి.. ఉపాధి కోసం సౌదీ అరేబియా వలస వెళ్లాడు. అతనికి అక్కడ అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ప్రతి నిత్యం రవి.. తన యజమాని చేతిలో దెబ్బలు తింటూనే ఉన్నాడు. యజమాని చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురవుతున్న రవిని కాపాడాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులు.. ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం నాయకులు కోటపాటి నరసింహ నాయుడును కోరారు. 

ఈ విషయాన్ని మాజీ ఎంపీ కవిత దృష్టికి నాయుడు తీసుకెళ్లారు. కవిత తక్షణమే ఈ విషయంపై స్పందించి.. సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్‌ ఔసాఫ్‌ సయీద్‌ను సంప్రదించారు. రవి కాపాడేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ట్విట్టర్‌ ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ జాగృతి సౌదీ అధ్యక్షులు మౌజం అలీ ఇఫ్తెకార్‌.. యజమానితో, స్థానిక పోలీసులతో మాట్లాడి.. రవి వీసా తిరిగి ఇప్పించారు. ఆ తర్వాత జూన్‌ 2న రవిని తన యజమానిని నుంచి విడిపించి.. ఖొర్మ ప్రాంతంలో తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత భారత ఎంబసీ అధికారులతో కవిత మాట్లాడి.. రవిని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు విమాన టికెట్‌ ఏర్పాటు చేయించారు. మొత్తానికి జూన్‌ 14వ తేదీన రవి హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం జాగృతి నాయకులు.. రవిని చేపూరుకు తీసుకెళ్లి.. అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

మాజీ ఎంపీ కవిత సహకారం లేకపోతే తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేదని రవి ఉద్విగ్నతతో మాట్లాడారు. తన యజమాని నరకం నుంచి బయటపడటం ఎంతో హాయిగా ఉందన్నారు. తనను ప్రాణాలతో కాపాడిన కవితకు రవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. logo