మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 04:05:10

ఒకేసారి 30 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌

ఒకేసారి 30 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌

  • సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్లలో ఏర్పాటు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బుల్లెట్‌ థర్మల్‌ ఇమేజ్‌ స్క్రీనింగ్‌ కెమెరా ద్వారా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల ఉష్ణోగ్రతలను పరీక్షిస్తున్నది. సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్లలో వీటిని ఏర్పాటుచేసి ఒకేసారి 30 మందిని పరీక్షిస్తున్నది. తద్వారా థర్మల్‌ స్క్రీనింగ్‌ వేగం పుంజుకోవడంతోపాటు సమయం ఆదా అవుతున్నది. బుల్లెట్‌ థర్మల్‌ ఇమేజ్‌ స్క్రీనింగ్‌ కెమెరా పరికరాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ కెమెరా, నెట్‌వర్క్‌ వీడియో రికార్డర్‌, ఎల్‌ఈడీ మానిటర్లు, అలారం మెకానిజం ఉన్నాయి. ప్రవేశానికి ఆరుమీటర్ల దూరంలో ఉన్న కెమెరా ఫోకస్‌ రేంజ్‌లోకి ఒక ప్రయాణికుడు ప్రవేశించనప్పుడల్లా కెమెరా ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడం ప్రారంభిస్తుంది. మాస్కులు ధరించని వారిని గుర్తిస్తుంది. స్కాన్‌చేస్తున్నవారి ఉష్ణోగ్రతల వివరాలను మానిటర్‌లో చూడవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు ఉంటే అలారం మోగుతుంది. మాస్క్‌ ధరించనివారిని గుర్తించి సిబ్బందిని అలర్ట్‌ చేస్తుంది. సికింద్రాబాద్‌లో మొదటి ఫ్లాట్‌ఫాంకు వెళ్లే దగ్గర ఒకటి, పదోనంబర్‌ ఫ్లాట్‌ఫాం దగ్గర మరోటి ఏర్పాటుచేశారు. రద్దీ ఉన్న స్టేషన్‌లో ప్రాధాన్యతాక్రమంలో వీటిని ఏర్పాటుచేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.logo