బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 03:40:30

బాషింగ బలం రెండొద్దులే!

బాషింగ బలం రెండొద్దులే!

  • ఈ సీజన్ రేపు, ఎల్లుండే చివరి ముహూర్తాలు
  • ఆర్భాటాలు లేకుండానే వివాహాలు
  • ఆగస్టు 8 తర్వాత మూడు నెలలు శూన్యం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పెళ్లంటె పం దిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు తలంబ్రా లు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు.. అన్నారో సినీ కవి.. ఇప్పుడవేవీ లేకుండా నిరాడంబరంగా పెండ్లితంతు ముగించేస్తున్నారు. కరోనాకాలం కావడమే ఇందుకు కా రణం. హంగు ఆర్భాటాలు లేకుండా జంటలను ఒక్కటి చేస్తున్నారు. ఈ నెల 14,15 తేదీల్లో (ఆది, సోమవారాల్లో) మాత్రమే వివాహ ముహూర్తాలు ఉండటం.. ఆపై నలభై రోజుల తర్వాత అంటే జూలై 24వ తేదీ వరకు ఎలాంటి ముహూర్తాలు లేకపోవడం గమనార్హం. సమీప కాలంలో ముహూర్తాలు తక్కువగా ఉండటం, అట్టహాసపు పెండ్లిళ్లకు అవకాశం లేకపోవడంతో చాలా మంది వివాహ తంతును అలా ముగించేస్తున్నారు. దీనివల్ల అటు ఖర్చు కలిసి రావడమేకాక ఒక జీవితకాల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆనందం వారికి లభిస్తున్నది. పలువురు ఇండ్లవద్దే, ఉన్నంతలో నిరాడంబరంగా, సమీప బంధువులను మాత్రమే ఆహ్వానించి మూడుముళ్లూ వేయించేస్తున్నారు. మరికొద్ది రోజులలో జ్యేష్ఠమాసం పూర్తి కావస్తున్నది. ఇప్పుడు మిగిలినవి కేవలం రెండే ముహూర్తాలని, ఆషాఢం శూన్యమాసమని, శ్రావణంలో పాతికకు పైగా ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెప్తున్నారు. ఆ తర్వాత కార్తీక, మార్గశిరాల్లో ముహూర్తాలు ముప్పయికి పైగానే ఉన్నాయి. నిజ ఆశ్వయుజంలోనూ రెండు, మూడు ముహూర్తాలు ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తం మీద వచ్చే మార్గశిరంలోగా 60కి పైగా ముహూర్తాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.  

ఇండ్ల వద్దే పెండ్లిళ్లు

చైత్ర, వైశాఖ మాసాల్లో (ఏప్రిల్, మే) ఇరవైకిపైగా ఉన్న ముహూర్తాల్లో పలు వివాహాలు జరిగాయి. నిరాడంబరంగా కరోనా నిబంధనలు పా టిస్తూ ఇండ్లముందే పందిళ్లు వేసి సమీప బంధువులను మాత్రమే ఆహ్వానించి తంతు ముగిస్తున్నారు. ఈ రెండు నెలలకాలంలో సింపుల్ పెండ్లిళ్లు కానిచ్చారు. ఇంకా ఎందరో వచ్చే శ్రావ ణం, కార్తీక మాసాల్లో ముహూర్తాలు ఉండటం తో పెండ్లిళ్లను వాయిదా వేసుకొన్నారు. దీంతో అప్పటికి వేల సంఖ్యలో పెండ్లిళ్లకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే, అప్పటికి కరోనా పరిస్థితులు సద్దుమణుగుతాయన్న   నమ్మకం కూడా పెద్దగా కనిపించడం లేదు.  

రెండొద్దులు.. వేల లగ్గాలు

ప్రస్తుత జ్యేష్ఠమాసంలో మిగిలిన రెండు రోజులు (14, 15 జూన్), శ్రావణం, కార్తీకం, మార్గశిరంలలోనే మంచి ముహూర్తాలున్నాయని, ఈ కాలంలో వేల పెండ్లిళ్లకు అవకాశం లేకపోలేదని ప్రముఖ పంచాంగకర్తలు యాయవరం చంద్రశేఖరశర్మ, ఆకెళ్ల జయకృష్ణశర్మ, గుడి ఉమామహేశ్వరశర్మ తదితరులు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత వచ్చే శ్రావణమాసం (జూలై 24 నుంచి ఆగస్టు 8వ తేది వరకు)లో 26 ముహూర్తాలున్నాయి. ఆపై నవంబర్ 19 (కార్తీకమాసం) వరకు మంచి ముహూర్తాల్లేవు. అంటే, సుమారు మూడు నెలలపాటు వివాహ ముహూర్తాలు లేనట్టే.   


logo