మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:25:22

పైసే ఫేక్‌కే షాదీ కర్‌లో!

పైసే ఫేక్‌కే షాదీ కర్‌లో!

  • అప్పు తీర్చాలని నిఖా అడ్డగింత
  • వరుడితో వాగ్వాదం
  • పెద్దల జోక్యంతో కొనసాగిన నిఖా

ఎర్రగడ్డ:  గురువారం మధ్యాహ్నం.. ఒంటి గంట.. బోరబండ సైలానీనగర్‌ కాలనీలోని హంజా మసీదు పెండ్లి వారితో కళకళలాడుతున్నది. కొద్ది క్షణాల్లో నిఖా.. ఏర్పాట్లు సాగుతున్నాయి. మతపెద్దలు, బంధువులతో మసీదు ప్రాంగణం హడావిడిగా ఉన్నది. అంతలోనే ఓ వ్యక్తి అరుస్తూ మసీదులోకి వచ్చాడు.. ‘కైకా షాదీ మియా.. పైలే పైసే ఫేకో.. బాద్‌ మే షాదీ కర్‌లో’ అంటూ హూంకరించాడు.  వధూవరుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాసేపు మిన్నకున్న ఆ పెద్ద మనిషి.. మళ్లీ అరవడం మొదలు పెట్టాడు.  దీంతో ఓపిక నశించిన వరుడి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో పెండ్లి సజావుగా సాగింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బోరబండ డివిజన్‌ సైలానీనగర్‌లోని హంజా మసీదులో గురువారం చోటుచేసుకున్నది. సనత్‌నగర్‌ బీకే గూడకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ రజాక్‌, అబ్దుల్‌ గఫార్‌ ఎస్సార్‌నగర్‌లోని ఓ వర్క్‌ షాప్‌లో పనిచేస్తుంటారు. దీని యజమాని అయిన అమీరుద్దీన్‌ ఖిల్జీ(మున్నా).. కొద్ది నెలల క్రితం రజాక్‌, గఫార్‌లకు చెరో రూ.లక్ష చొప్పున అప్పుగా ఇచ్చాడు. 3 నెలల్లో తీసుకున్న అప్పు తిరిగి  ఇచ్చేస్తామని అన్నదమ్ములిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబానిది పూట గడవని పరిస్థితి. డబ్బుల కోసం మున్నా తరచూ వాళ్లను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో బోరబండ బాబా సైలానీనగర్‌లో రజాక్‌కు పెండ్లి సంబంధం కుదిరింది. గురువారం మసీదులో నిఖా జరుగుతుండగా మున్నా అక్కడికి వచ్చి అప్పు తీర్చాలంటూ నానా హంగామా చేశాడు. డబ్బులు ఇచ్చేదాకా కదిలేది లేదంటూ భీష్మించాడు. వరుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గొడవ సద్దుమణిగింది. 


logo