గురువారం 09 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 12:56:18

పల్లె పల్లెనా కల్లాల నిర్మాణం

పల్లె పల్లెనా కల్లాల నిర్మాణం

హైదరాబాద్ : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కల్లాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై ఆరబోస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లోని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమైంది. మంత్రులు హరీశ్‌ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉపాధిహామీ కింద హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో లక్ష కల్లాలు నిర్మించాలనే విషయంపై చర్చించారు.

45 సెంటీ మీటర్ల ఎత్తు 45 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో ప్లాట్ ఫామ్ నిర్మాణానికి రూ.46,045 అవుతుందని అంచనా వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం మంత్రివర్గ ఉప సంఘం పలు నిర్ణయాలు తీసుకుంది. 2020 -21 ఏడాదికి గాను 40 నుంచి 45 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా. National Rural Livelihood Mission (NRLM) కింద వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి / దాచిపెట్టడానికి, సేంద్రియ ఎరువుల తయారీకి శాశ్వత నిర్మాణాలకు ప్రోత్సాహం. స్థానిక అవసరాల మేరకు ప్లాట్ ఫామ్ ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.


logo