మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 08:03:00

కాపాడండయ్యా నన్ను.!

కాపాడండయ్యా నన్ను.!

అందరికీ శనార్తులు.. 

వార్తలకు స్వాగతం.. నేను మీ పోశమ్మ! 

ముందుగాల ముందుగాల.. ముఖ్యాంశాలు.

.. అటెండర్‌ నౌకరీ.. సంతకాల షికారీ

.. గుడి భూమిపై నజరీ.. కలెక్టర్‌ సైన్‌ ఫోర్జరీ 

.. ఆఫీసుకు కొట్టిండు డుమ్మా.. అడ్డంగా దొరికిండమ్మా 

ఇంతింత రమ్మంటే ఇల్లంతొచ్చిండంట ఎన్కటికి ఒకాయ్నె. ఇగో.. గసొంటి కతనే జరిగింది ఒకతాన. ఏ.. పోనీ పాపం శిన్న నౌకరే కదానీ.. చూసీ చూడనట్లు వదిలేస్తే అసల్కే ఎసర్వెట్టిండు ఒక అటెండర్‌. మనోడు నజర్‌వెట్టింది ఐదుకో పదికోగాదు.. కోట్ల రూపాల భూములకే కొండనామంబెట్టి కలెక్టర్‌కే కండ్లు బైర్లుకమ్మేటట్లు జేసిండు. అగ్గో.. కలెక్టర్నే గోల్‌మాల్‌ జేసేటంత మొనగాడా ఆ అటెండర్‌ అంటే..? ఔ.. హుషారుండు గావట్టే అధికారులందరి కండ్లుగప్పి కత నడ్పించిండు. 

ఇగ అసల్‌ ముచ్చటకువోదామా.? 

శీకాకులం జిల్లా టెక్కలి దేవదాయ శాఖలో ధర్మారావ్‌ అనేటాయ్నె అటెండర్‌. ఐదువేల రూపాల జీతానికి నౌకరీ దొర్కవట్టిండు. ‘మంచిగనే పన్జేస్తడు.. ధర్మరాజసొంటోడు’ అనే నమ్మికెంగల్పించిండు. కమీషన్లు.. కతలు సూడనియా? వాళ్లుజేసే కార్వాయిలు.. కత్వలు అటెండర్కు తెల్సు కావట్టే మంచిగ మెల్తామైండు అందరితోని. ఒక్కరోజుగిట్ల ధర్మరావు రాకపోతే.. ‘అయ్యో.. ధర్మరావు రాకపాయె’ అని దెవులాడుకుంటరంట సిబ్బంది. 

ఇదే మోఖా అన్కుండో.. ‘ఏ గీల్లేంజేస్తర్‌ నన్ను’ అన్కుండో ఏమోగనీ మనోడు మంచి దుకానమే వెట్టిండు.  

నందిగాం.. మెలియాపుట్టిలో ఉన్న లచ్చింనర్సిమ్మ సామి గుడి భూములపై నజర్‌వెట్టిండు. గౌర్మెంటిచ్చే కాయిదాల్లెక్కుండే పట్టాలు తయార్జేసి కలెక్టర్‌.. దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సంతకాలు వెట్టిండు. స్టాంపుగీంపు.. సక్కంగ దిద్దుకొని వేరేటోల్లకు అమ్మేసి సప్పుడుగాకుంట ఉన్నడు. 

ఇంత జరిగినా మనోడికి సేఫ్‌ ఏందంటే.. భూములు ఒకర్నుంచి ఒకరికి చేతులు మార్నయిగానీ కబ్జా మీదికెవరూ రాలేదు. సేఫ్‌గా ఉన్నడు. దొర్కకుంట ఎన్నిరోజులుంటడు? మనోడు ఆఫీసుకు పోతలేడు. ‘ఎందుకొస్తలేవ్‌' అని అధికారులడిగితే అత్కని జవాబియ్యవట్టె. ‘కొల్వుజేయాలనుకుంటున్నవా? లేదా?’ అని నోటీసులు కూడా పంపిండ్రు. 

దరిద్రం నెత్తిల కూసుంటే దార్కారీ ఐనా పట్టువడాల్సిందే గదా? ఈటైంలనే ధర్మారావు కోసం కొందరు ఊకే ఆఫీసుకు వొచ్చుడు షురువైంది. డౌటనుమానంతో ఈఓ ఆరాదీస్తే అసల్‌కత బైటవడ్డది. ఇంతకూ మనోడు ఆ భూమిని ఎంతమందికి అమ్మిండో తెల్సా? పదిమందికి అమ్మి  తలా రూ.1.40 లచ్చలు వొసూల్జేసిండు.  

తినమర్గిన కోడి ఇల్లెక్కి కూసిందంటే గిదేనేమో.. ఏదో శిన్నజీతంగదా.. కర్సులమందం సంపాయించుకోనని సూశిసూడనట్లు వదిలేస్తే మనోడు ఏకంగా గుడి భూమికే గొల్సువెట్టే ప్లానేశిండు. చేసేదంతజేసి ఇప్పుడు ‘కాపాడండయ్యా నన్నూ’ అంటూ లబోదిబోమంటుండు. 


logo