గురువారం 02 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 12:05:54

కరువు నేలలో గోదావరి జలాలను పారించిన ఘనత సీఎం కేసీఆర్ దే

కరువు నేలలో గోదావరి జలాలను పారించిన ఘనత సీఎం కేసీఆర్ దే

సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలో తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్నిఘనంగా నిర్వహించారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణా తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి, అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 20 సార్లకు పైగా సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటనలు చేసి అభివృద్ధి చేశారని తెలిపారు. సూర్యాపేట జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన గోదావరి జలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. గోదావరి జలాలతో జిల్లాలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. 

ఒకప్పుడు కరువు కాటకాలతో, వలస పోయిన ప్రజలు నేడు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ , మల్కాపూర్ ఇండస్ట్రీయల్ పార్క్, యాదాద్రి ఆలయ అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఎయిమ్స్, రెండు మెడికల్ కాలేజీల ఏర్పాటు, సాగర్ ఆయకట్టులోని చివరి భూములకు సాగు నీరు అందించడం, ఇలా పలు అభివృద్ధి పనులు చేపట్టి సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని మంత్రి తెలిపారు.


logo