మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 19:49:15

ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : కరోనా నుంచి దేశాన్ని కాపాడి సుభిక్షంగా ఉండాలని రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు అల్లాను ప్రార్థించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో శనివారం మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గౌని బుచ్చారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ గౌని కోదండరాంరెడ్డి సౌజన్యంతో అందించిన నిత్యావసర సరుకులను నిరుపేద ముస్లింలకు రంజాన్‌ తోఫాగా మంత్రి నిరంజన్‌రెడ్డి పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలు ఇండ్లల్లోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలను మంత్రి అభినందించారు. భోజనం పెడుతూ సరుకులు పంపిణీ చేస్తూ వారికి తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారని అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందని తెలిపారు. 

అనంతరం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ యువ నాయకులు అక్రమ్‌, ఖాదర్‌, అజహర్‌ సలీమ్‌, వాజీద్‌ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణశ్రీ, జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ శైలజ, నాయకులు పాల్గొన్నారు. logo