గురువారం 04 జూన్ 2020
Telangana - May 23, 2020 , 19:41:00

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ  ధ్యేయం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్‌ : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌ జెడ్పీ మైదానంలో ఇమామ్‌, మౌజన్‌లకు రంజాన్‌ నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే వెంకటేశ్వర కాలనీలోని గెలాక్సీ స్కూల్‌ ఆవరణలో తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో క్వారంటైన్‌లో ఉండి వచ్చిన జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్‌ మాసంలో, పర్వదినం రోజు ముస్లింలు ఇంటి వద్దే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. పాలమూరు పట్టణాభివృద్ధే తమ ముందున్న లక్ష్యమన్నారు. ఇప్పటికే రోడ్డు విస్తరణతోపాటు చౌరస్తాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలుపుతామని అన్నారు. 

అంతకుముందు ఏనుగొండలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.2.05 కోట్లతో నిర్మించనున్న అదనపు తరగతులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వన్‌టౌన్‌ నుంచి అమిస్తాపూర్‌ వరకు రూ.5.20 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. 

ఈ కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొరమోని వెంకటయ్య, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ తాటిగణేష్‌, డీఈఓ ఉషారాణి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.


logo