మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 18:26:11

పంట తీరు మారాలి... రైతు బాగుపడాలి...

పంట తీరు మారాలి... రైతు బాగుపడాలి...

సిద్ధిపేట : గజ్వేల్‌లోని మహాతి ఆడిటోరియంలో శనివారం మధ్యాహ్నం వానా కాలం-2020 నియంత్రిత పంటల సాగుపై రైతుబంధు సమితి మండల సమన్వయ కర్తలకు, వ్యవసాయ శాఖ అధికారులు, సర్పంచ్‌ లు, ఏంపీటీసీలు, ఏంపీపీ, జెడ్పీటీసీ, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లు, పీఏసీఎస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ రాష్ర్టానికే అన్నింటా గజ్వేల్‌ ఆదర్శం అన్నారు. నియంత్రిత పంట సాగులో కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులదేనని మంత్రి దిశానిర్దేశం చేశారు. 

నియంత్రిత సాగు కూడా సాధ్యం చేసి చూపుదామని మంత్రి పిలుపునిచ్చారు. ఈ వారంలోపే గ్రామ, వ్యవసాయ ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు మంత్రి. ప్రతి గుంట, ప్రతి గంట ఈ వారంలోపే గ్రామం వారీగా వ్యవసాయ లెక్కలు తీయాలని ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రైతుల్లో ఆత్మ విశ్వాసం వచ్చిందన్నారు. రైతు ఒక శక్తిగా ఎదిగేలా.. రైతులను సంఘటితం చేసి ఒకే తాటిపైకి తెచ్చి రైతే తాను పండించిన పంటకు ధర నిర్ణయించడమే..ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నియంత్రిత పంట సాగు ఉద్దేశమన్నారు మంత్రి. రైతు మరోకరిపై ఆధారపడొద్దన్నదే ప్రభుత్వ తాపాత్రయమని మంత్రి అన్నారు.  

గజ్వేల్‌లో 1.7 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, పోయిన వానాకాలంలో 27 వేల ఏకరాల్లో వరి పంట సాగు చేశారని., కొండ పోచమ్మ సాగరుకు గోదావరి జలాలు వచ్చాక భూగర్భ జలాలు పెరిగి.. మనకేమీ బాధలు ఉండవన్నారు. ఈ వానాకాలం నుంచి 27 వేల నుంచి 50 వేల ఎకరాల దాకా వరి సాగు పెంపు చేద్దామని, కొంత సన్న రకం, కొంత దొడ్డు రకం వరి పంటలు వేద్దామని ప్రజాప్రతినిధులకు, వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు. వానా కాలం మక్క పంట వేసే బదులు యాసంగికి పోదామని ప్రభుత్వం సూచన చేస్తుందని సూచించారు. స్వీట్‌ కార్న్‌, సీడ్స్‌కు అమ్మేటోళ్లు, దాణాకు అమ్మేటోళ్లకు, కంకులు అమ్మే రైతులకు మక్కజొన్న పంట వేసే వీలుంది. కానీ ముందే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని, వీరికి కూడా రైతుబంధు వస్తుందని హామీ ఇచ్చారు మంత్రి.

వానా కాలం కందులు ఎక్కువ వేయమని ప్రభుత్వం చెబుతున్నదని, వానా కాలంలో మక్క పంట వేస్తే రైతులు నష్టపోతున్నారని, మక్క పంట ఎందుకు వద్దంటున్నామంటే.. కత్తెర పురుగు వచ్చి పంట దిగుబడి ఎకరాకు దాదాపు 15 క్వింటాళ్లలో మక్క దిగుబడి తగ్గుతుందని, వానా కాలంలో మక్క పెడితే పౌల్ట్రీ ఫామ్‌ కోసం వద్దని ప్రభుత్వం సూచిస్తుందని మంత్రి వివరించారు. గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల వారీగా కందుల పంటలు వేసిన వివరాలు తెలుపుతూ.. పత్తి లాభసాటిగా ఉందని, గత వానా కాలంలో 83 వేల ఎకరాల్లో సాగు చేశారని, ఈ యేటా 90 వేల ఎకరాల్లో పత్తి సాగు పెంపు చేయాలని సూచించారు. 

సిద్ధిపేట జిల్లాలో 9 వేల ఏకరాల్లో కూరగాయలు పండితే.. 5 వేల ఎకరాలు గజ్వేల్‌ నియోజక వర్గానిదేనని, కూరగాయల సాగు చేసే రైతులకు అధిక ప్రోత్సాహం ఉంటుందని మంత్రి వెల్లడించారు. సన్న, దొడ్డు రకం వరి పంట రకాల గురించి క్షుణ్ణంగా అవగాహన కల్పించారు మంత్రి. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల మేలు కోసమే పని చేస్తుందని, మార్కెట్లో ఉన్న డిమాండ్‌ అంతర్జాతీయంగా పంటలకు ఉన్న డిమాండ్‌ ఆధారంగా సాగు చేయాలని మంత్రి సూచించారు. రైతు బంధు ఇవ్వమనేది.. ప్రభుత్వ ఉద్దేశం కాదు.. ప్రతి రైతుకు రైతుబంధు అందిస్తాం. వానా కాలం పంట కోసం రైతులకు రైతు బంధు కోసం రూ.7 వేల కోట్ల బడ్జెట్‌లో పెట్టామన్నారు మంత్రి.logo