మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 14:43:25

బావిలో మృతదేహాల కేసులో పురోగతి

బావిలో మృతదేహాల కేసులో పురోగతి

వరంగల్‌ రూరల్‌ : గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బార్‌దాన్‌ గోడౌన్‌ ఆవరణ ఉన్న బావిలో మొత్తం 9 మృతదేహాలు లభ్యమైన విషయం విదితమే. ఈ కేసులో పురోగతి లభించింది. ఎండీ మక్సూద్‌ కాల్‌డేటా కీలకంగా మారింది. ఆయన కాల్‌డేటా ఆధారంగా ఇద్దరు బీహారీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్‌కుమార్‌ యాదవ్‌, మోహన్‌లను ఘటనాస్థలికి తరలించి పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు ముందు సాయంత్రం 6 గంటల సమయంలో బీహార్‌ యువకులతో మక్సూద్‌ మాట్లాడినట్లు తేలింది. బీహారీ యువకుల వాంగ్మూలం కేసులో కీలకంగా మారనుంది. 

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎండీ మక్సూద్‌ కుటుంబం 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలసొచ్చింది. అయితే బార్‌దాన్‌లోని గోనే సంచుల గోడౌన్‌లో మక్సూద్‌ కుటుంబం పని చేస్తోంది. బావిలో లభ్యమైన మృతదేహాలను మక్సూద్‌(50), ఆయన భార్య నిషా(45), కుమారులు షాబాద్‌(22), సోహైల్‌(20), కుమార్తె బుస్ర(20), బుస్ర కుమారుడు(3), బీహార్‌ చెందిన కార్మికులు శ్యామ్‌(22), శ్రీరామ్‌(20), వరంగల్‌ వాసి షకీల్‌గా పోలీసులు గుర్తించారు. 

నమూనాలను సేకరించిన ఫోరెన్సిక్‌ బృందం

గొర్రెకుంటలో మరోమారు నమూనాలను ఫోరెన్సిక్‌ బృందం సేకరించింది. గోనె సంచుల గోదాముతో పాటు బావి పరిసరాల్లో నమూనాలను సేకరించారు. ఫొరెన్సిక్‌ నివేదిక రావడానికి 10 రోజుల సమయం పడుతుందని ఫోరెన్సిక్‌ నిపుణులు రాజామాలిక్‌ పేర్కొన్నారు. విష ప్రయోగం జరిగిందనే కోణంలో ఆహార పదార్థాలను పరీక్షిస్తున్నామని తెలిపారు. మృతదేహాలపై గాయాలను గుర్తించామని రాజామాలిక్‌ చెప్పారు. ఘటనాస్థలిని అదనపు డీసీపీ వెంకటలక్ష్మి, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పరిశీలించారు. గొర్రెకుంట ఘటనపై 6 బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయని మమునూరు ఏసీపీ శ్యామ్‌సుందర్‌ తెలిపారు. అనేక కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు. logo