గురువారం 04 జూన్ 2020
Telangana - May 22, 2020 , 00:41:25

చుట్టాలు వద్దన్నారనే చెప్పలేదు

చుట్టాలు వద్దన్నారనే చెప్పలేదు

  • కరోనా మరణాల్లో దాపరికం లేదని స్పష్టంచేసిన మంత్రి ఈటల 
  • తన భర్త మృతి విషయం చెప్పలేదని మంత్రి కేటీఆర్‌కు మహిళ ట్వీట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/వనస్థలిపురం: వారి చుట్టాల సూచనమేరకే కరోనాతో ఓ వ్యక్తి చనిపోతే అప్పటికే క్వారంటైన్‌లో ఉన్న అతడి భార్యకు ఆ విషయం చెప్పలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. భర్త మృతి చెందిన విషయాన్ని తనకు చెప్పలేదని ఓ కరోనా బాధితురాలు ట్విట్టర్‌ ద్వారా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి ఈటల గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనాతో మరణించిన మధుసూదన్‌ అంత్యక్రియలను బంధువులకు చెప్పకుండా ప్రభుత్వం నిర్వహించిందని వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఏప్రిల్‌ 29న వనస్థలిపురానికి చెందిన ఈశ్వరయ్య కరోనా పాజిటివ్‌తో గాంధీలో చేరగా, 24 గంటల్లోపే చనిపోయారని వివరించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులందరికీ పరీక్షలు చేశామని, ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్‌ తీవ్రమైన శ్వాస సంబంధ సమస్య తో గాంధీలో చేరగా మే 1న చనిపోయినట్టు తెలిపారు. అప్పటికే ఆయన భార్యతో సహా కుటుంబసభ్యులందరూ క్వారంటైన్‌లో ఉన్నారని, అతడి భార్యకు చెప్తే షాక్‌కు గురవుతుందని, గంభీరమైన సందర్భంలో చెప్పకపోవడమే మేలని వారి చుట్టాలు అనడంతో మృతదేహాన్ని పోలీసులకు అప్పగించి జీహెచ్‌ఎంసీ ద్వారా దహనసంస్కారాలు నిర్వహించామని వివరించారు. వారి కుటుంబసభ్యులు కోలుకొని బయటకొచ్చాక గాంధీ దవాఖానపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారని, వాళ్లపై ఆరోపణలు చేయడం మంచిపద్ధతి కాదని సూ చించారు. కరోనావ్యాప్తి, చికిత్స, మరణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాపరికం లేకుండా ప్రకటన చేస్తున్నదని చెప్పారు. 

ఆ మానిటరింగ్‌ ప్రైవేటుతో సాధ్యం కాదు

కరోనా సోకిన వారితో కాంటాక్ట్‌ అయినవారిని గుర్తించాల్సిన అవసరం ఉన్నదని, ఆ మానిటరింగ్‌ ప్రైవేటువారితో సాధ్యంకాదని ఈటల పేర్కొన్నారు. కొవిడ్‌ పరీక్షలు, చికిత్స ప్రభుత్వరంగంలోనే అందించాలని, ఆ సామర్థ్యం తెలంగాణకు ఉన్నదని సీఎం కేసీఆర్‌ మొదటి నుంచి చెప్తున్నారని, సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ దవాఖానల పరిధిలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స అందిస్తున్నామన్నారు. వైద్యారోగ్య, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, పోలీస్‌, రెవెన్యూశాఖలన్నీ కలిసి పనిచేస్తేనే కరోనా వ్యాప్తి కట్టడి సాధ్యమవుతున్నదని చెప్పారు. ప్రైవేటు దవాఖానల్లో కరోనా పరీక్షలు, చికిత్సలు చేయాలనే అంశంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.


logo