బుధవారం 03 జూన్ 2020
Telangana - May 21, 2020 , 21:28:41

అమెరికాలో శిక్ష ముగించుకొని ఇండియా చేరిన హైదరాబాద్‌ ఇంజినీర్‌

అమెరికాలో శిక్ష ముగించుకొని ఇండియా చేరిన హైదరాబాద్‌ ఇంజినీర్‌

న్యూయార్క్‌: అల్‌ఖైదాకు ఆర్థిక సహకారం అందజేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుశిక్షకు గురైన హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్‌ బుధవారం ఇండియా చేరుకొన్నారు. వెంటనే ఆయనను ఓ ప్రదేశానికి తీసుకెళ్లిన భారత భద్రతా బలగాలు.. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై పలు కోణాల్లో ఆయనను విచారించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఇబ్రహీం జుబేర్‌ మహమ్మద్‌ అనే ఇంజినీర్‌ను 2011లో అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అల్‌ఖైదాకు ఆర్థిక సహకారం అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలపై ఆయనను కోర్టులో విచారించారు. జుబేర్‌ సోదరుడు యాహ్యా ఫరూఖ్‌ మహమ్మద్‌ తరచూ అల్‌ఖైదా నాయకుడు అన్వర్‌ అల్‌ అవ్లాకీకి డబ్బులు పంపేవారి విచారణలో తేలింది. వీరి బ్యాంక్‌ అకౌంట్ల నుంచి దాదాపు 50 సార్లు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు కోర్టులో నిరూపించారు. దాంతో తుది విచారణ అనంతరం ఇబ్రహీం జుబేర్‌కు ఐదేండ్ల జైలుశిక్ష విధించగా.. ఆయన సోదరుడు యాహ్యా మహమ్మద్‌కు 27 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. 

తనకు విధించిన జైలుశిక్ష పూర్తికావడంతో ఇబ్రహీం జుబేర్‌ మహమ్మద్‌ బుధవారం ఇండియా చేరుకొన్నారు. వెంటనే పోలీసులు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆయనకు ఏయే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే విషయంపై ఆరాతీసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. కాగా, షార్జాలో జన్మించిన ఇబ్రహీం జుబేర్‌ మహమ్మద్‌.. 2001లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన అనంతరం ఉన్నత విద్యాభాస్యం నిమిత్తం అమెరికా వెళ్లాడు. అక్కడ ఇల్లినాయిస్‌ యూనివర్సిటీలో కూడా చదివిన అనంతరం 2006లో పెండ్లి చేసుకొన్నట్లు తెలిసింది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo