బుధవారం 03 జూన్ 2020
Telangana - May 20, 2020 , 14:37:34

మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన

మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన

మెదక్‌ : మెదక్‌ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణం కల త్వరలోనే నెరవేరనుందన్నారు. కేసీఆర్‌ రైతుబిడ్డ అయినందునే ఈ కల నేరవేరుతుందని హరీష్‌రావు తెలిపారు. సమైక్య పాలకుల కుట్రల వల్లే మంజీరాపై చెక్‌ డ్యామ్‌ నిర్మించడం సాధ్యం కాలేదన్నారు. జిల్లాలోని హవెలి ఘన్‌పూర్‌ మండలం సర్దన గ్రామంలో మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఇవాళ సర్దన వద్ద చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ డ్యామ్‌ ఐదు గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు. పాపన్నపేటలో మూడు గ్రామాలు, ఘనపురం మండలంలో రెండు గ్రామాల రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంజీరాపై చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం జరగలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంజీరా నదిపై దాదాపు 15 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయించుకున్నామని మంత్రి గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఫసల్వాది గ్రామం నుంచి చివరన సర్దన వరకు ఈ పదిహేను డ్యామ్‌ల నిర్మాణం జరుగుతుందన్నారు.

మంజీరా నదిపై చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని హరీష్‌రావు స్పష్టం చేశారు. 25 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. కొండపోచమ్మ సాగర్‌కు నీరు వచ్చిన వెంటనే హల్దీ ద్వారా బొల్లారం మత్తడికి వస్తాయి. అక్కడి నుంచి సర్దన చెక్‌డ్యామ్‌, కూచనపల్లి చెక్‌డ్యామ్‌కు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. బొల్లారం మత్తడి కింద 13 వేల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వొచ్చు అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. 


logo