సోమవారం 01 జూన్ 2020
Telangana - May 18, 2020 , 16:56:51

ఆరో విడ‌త‌ హరితహారాన్ని విజయవంతం చేయాలి

ఆరో విడ‌త‌ హరితహారాన్ని విజయవంతం చేయాలి

హైద‌రాబాద్ : జూన్ 20 నుంచి ప్రారంభంకానున్న ఆరో విడ‌త‌ హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తం కావాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర‌ణ్ రెడ్డి అన్నారు. గత అనుభవాలతో ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రణాళికలు రూపొందించుకోవాల‌ని సూచించారు.  అర‌ణ్య భవన్‌లో ఆర‌వ విడ‌త హ‌రితహారం కార్యక్రమంపై అట‌వీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి స‌మీక్షించారు. 

గ‌తంలో నాటిన మొక్కలు- వాటి సంర‌క్షణ‌, వేసవి కాలంలో మొక్కలను కాపాడుకోవడానికి తీసుకుంటున్న జాగ్రత్తలు, గ్రీన్ ఫ్రైడే కార్యక్రమం, వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి సౌకర్యాలు, త‌దిత‌ర అంశాల‌పై మంత్రి ఆరా తీశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ..ఆర‌వ విడ‌త తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా అట‌వీ శాఖ ఆధ్వర్యంలో 3.59 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచామ‌న్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో నర్సరీలను ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఆయా శాఖ‌ల ఆధ్వర్యంలో మొక్కలు పెంచుతున్నార‌ని తెలిపారు. మొత్తంగా 24.74 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉంచామ‌ని వెల్లడించారు. అదేవిధంగా బీడీ ఆకుల సేక‌ర‌ణ‌ త్వరితగతిన పూర్తి అయ్యేలా అట‌వీ అధికారులు చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.  అందరూ భాగస్వామ్యులై హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.


logo