బుధవారం 03 జూన్ 2020
Telangana - May 18, 2020 , 12:09:57

పరిశ్రమల్లో జాగ్రత్తలపై మంత్రి హరీష్‌ రావు సమీక్ష

పరిశ్రమల్లో జాగ్రత్తలపై మంత్రి హరీష్‌ రావు సమీక్ష

సంగారెడ్డి: కలెక్టరేట్‌ కార్యాలయంలో పారిశ్రామిక యాజమాన్యాలతో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు సమావేశం నిర్వహించారు. అనుమతించిన పరిశ్రమలు ప్రారంభించేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి సమీక్ష జరిపారు. కరోనా నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు మంత్రి. సమీక్షలో జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ, పొల్యూషన్‌, బాయిలర్స్‌ డిపార్ట్మెంట్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ పాత పద్థతిలో పరిశ్రమలు నడపుతామంటే కుదరదన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకోకపోతే కార్మికుల మధ్య వైరస్‌ వేగంగా విస్తరిస్తుంది అన్నారు. వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. షిప్టు పద్దతిలో కార్మికులతో పని చేయించాలని, భౌతిక దూరం పాటిస్తూ కార్మికులు విధుల్లో పాల్గొనేలా చూడాలన్నారు మంత్రి హరీష్‌. కార్మికులకు మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. 

కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కార్మికుల్లో ఒక్కరికి కరోనా సోకినా ఆ పరిశ్రమలో ప్రొడక్షన్‌ ఆగిపోతుందని గుర్తుచేశారు మంత్రి. దీంతో పరిశ్రమను మూయాల్సి వస్తుందని హెచ్చరించారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులను తరలించే బస్సుల్లో  50 మందిని తీసుకెళ్తున్నారని, సీట్‌కు ఇద్దరే ఉండాలన్నారు.  వైజాగ్‌లో గ్యాస్‌ లీక్‌ ప్రమాదం తర్వాత అప్రమత్తంగా ఉండాలని ఆరోజే కలెక్టర్‌ ను ఆదేశించామని, చాలా రోజులు పరిశ్రమలు మూతపడటం వల్ల కెమికల్‌ రియాక్షన్‌ జరుగుతుందని, ఇలాంటివి జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. బాయిలర్స్‌ నిర్వహణ, ఫైర్‌ సేఫ్టీ, పొల్యూషన్‌ కంట్రోల్‌ వంటి విషయాల్లో అధికారులు, పరిశ్రమ యజమానులు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసిన తర్వాతే ప్రారంభించాలన్నారు. వైజాగ్‌ ఘటన తర్వాత సంగారెడ్డి పరిశ్రమలలో ప్రమాదాలు జరిగి ముగ్గురు చనిపోయారన్నారు.

ఏడాదిలో సగటున 25 నుంచి 30  మంది చనిపోతున్నారని, ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, బాయిలర్‌ డిపార్ట్మెంట్‌, పొల్యూషన్‌ అధికారులు సరిగా పని చేస్తే ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయన్నారు. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అయినా కార్మికులు, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం అన్నారు మంత్రి. ఫ్యాక్టరీలు ఉన్న చోట ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యావరణ నిబంధనలు తప్పకుండా పాఠించాలని, కరోనా నేపథ్యంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూం పని చేస్తుందని, పరిశ్రమ యాజమాన్యాలకు సమస్యలుంటే 08455-272525 నెంబరుకు ఫోన్‌ చేయండన్నారు. ఫ్యాక్టరీలలో ఒక్క ప్రమాదం జరగకూడదని గట్టిగా చెప్పారు మంత్రి.


logo