శనివారం 06 జూన్ 2020
Telangana - May 16, 2020 , 17:45:20

ఆదాయం పెరగాలి - అవస్థలు పోవాలి

ఆదాయం పెరగాలి - అవస్థలు పోవాలి

వ్యవసాయరంగంలో నూతన అడుగులు

ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత చర్యలు

నియంత్రిత పద్దతిలో వ్యవసాయం జరగాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన

రైతులు లాభసాటి వ్యవసాయం మీద దృష్టి పెట్టాలి

సమగ్ర వ్యవసాయ విధానంపై ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అధ్యక్ష్యతన సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయరంగంలో నూతన అడుగులు వేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాహసోపేత చర్యలు అన్నారు.  నియంత్రిత పద్దతిలో వ్యవసాయం జరగాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన అని మంత్రి తెలిపారు. రైతులు లాభసాటి వ్యవసాయం మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

గిట్టుబాటు ధర కాదు కనీస మద్దతు ధరకు కూడా రైతాంగం అవస్థలు పడుతుందన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. ఆ దుస్థితి నుండి రైతులు బయటపడాలన్నది ప్రభుత్వ కార్యాచరణ ఉద్దేశం అన్నారు. ప్రభుత్వ పథకాలు, సాగునీటి రాకతో రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నారన్నారు. వరి ఎక్కువగా పండించడం మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయని మంత్రి తెలిపారు. కంది, ఆముదం, ఆవాలు, వేరుశనగ, నువ్వులు, కుసుమ, ఆయిల్‌ పామ్‌ వంటి పప్పు, నూనె పంటల సాగు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రత్యామ్నాయంగా ఏ పంటలను రైతులకు సూచించగలమో చెప్పమని అధికారులకు సూచించారు మంత్రి. అదే సమయంలో మార్కెట్‌ లో ఉన్న డిమాండ్‌ను అంచనా వేయాలన్నారు. ఇతర రాష్ర్టాల పంటల సరళి, అవసరాల మీద అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. విత్తనాలు ఎంతవరకు అందుబాటులో ఉంటాయి అని అధికారులు కసరత్తు చేయాలని సూచించారు మంత్రి. పంటల సాగుకు సంబంధించి రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు కావాలి, ప్రభుత్వం ఏం సమకూర్చాలి అన్నది అధికారులు నివేదిక తయారుచేయాలి అని ఆదేశించారు మంత్రి.

వనరులున్నా మనదేశం అమెరికా, చైనాలను ఎందుకు ఉత్పత్తిలో ఢీ కొట్టలేకపోతుందని ప్రశ్నించారు మంత్రి. మార్కెటింగ్‌, ఉత్పత్తి విషయంలో ఆ దేశాలను ఎదుర్కొనేలా వ్యవసాయ నిపుణులు పరిశోధనలు చేయాలని సూచించారు. మనదేశంలో కొంత శాతం జనాభా మాత్రమే తాము కావాలనుకున్నవి తినగలుగుతున్నారని, మెజారిటీ ప్రజలు ఇప్పుడిప్పుడే తమ ఆకలి తీర్చుకునే స్థితికి వచ్చారని, ఈ స్థితి నుండి ప్రజలంతా కోరుకున్న ఆహారం తినగలిగే పరిస్థితి రావాలన్నారు మంత్రి.

ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ వీడియో కాన్ఫరెన్స్‌తో సమగ్ర వ్యవసాయ విధానంపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సమగ్ర వ్యవసాయ విధానంపై ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో వీసీ ప్రవీణ్‌ రావు, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రాంరెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ కేశవులు పాల్గొన్నారు.


logo