ఆదివారం 31 మే 2020
Telangana - May 16, 2020 , 15:48:33

ఈదురు గాలుల బీభత్సం.. దంపతులు మృతి

ఈదురు గాలుల బీభత్సం.. దంపతులు మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ ఈదురుగాలులకు ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన మిడ్జిల్‌ మండలంలోని మున్ననూర్‌ శివారులో మహబూబ్‌నగర్‌ - కోదాడ హైవేపై నూతనంగా నిర్మిస్తున్న టోల్‌గేట్‌ వద్ద చోటు చేసుకుంది. మున్ననూర్‌కు చెందిన డొంక కృష్ణయ్య, పుష్ప దంపతులు.. టోల్‌గేట్‌ వద్ద వరి ధాన్యాన్ని ఆరబెట్టారు. ఈదురుగాలులు వీచిన సమయంలో దంపతులు కూడా అక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి భారీ ఈదురుగాలులు వీచడంతో.. టోల్‌గేట్‌ కుప్పకూలిపోయింది. భారీ ఇనుపకడ్డీలు దంపతులపై పడిపోవడంతో.. వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

అనాథలైన ఇద్దరు పిల్లలు

కృష్ణయ్య, పుష్ప దంపతులు మృతి చెందడంతో వారికున్న ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. తల్లిదండ్రుల మృతదేహాలను చూసిన పిల్లలు గుక్కపట్టి ఏడ్చారు. అమ్మా లే అమ్మా అంటూ చిన్న కూతురు రోదించిన ఘటన అక్కడున్న వారి మనసులను కలిచివేసింది. ఈ హృదయవిదారక దృశ్యాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.


logo