గురువారం 04 జూన్ 2020
Telangana - May 16, 2020 , 03:01:38

దూదిపూలు పూయాలి

దూదిపూలు పూయాలి

 • ‘నీళ్లు కట్టే పత్తి’ పంట సాగుతో మంచి రాబడి 
 • 70 లక్షల ఎకరాల్లో వేసినా డిమాండ్‌ ఖాయం
 • యాసంగిలో మక్కతో ఎకరాకు 50 వేలు లాభం
 • 15 లక్షల ఎకరాల్లో కందిపంట పండిస్తే మేలు
 • సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ నిపుణుల సూచన
 • వరితో పోలిస్తే పత్తి పంటే ఉత్తమం 
 • వానకాలం 40 లక్షల ఎకరాల్లోనే వరి వేయాలి
 • యాసంగిలో అయితే 25 లక్షల ఎకరాలకే సరి  
 • రెండు కార్లలో కలిపి 65 లక్షల ఎకరాల్లో చాలు
 • ఈ వానకాలం మక్కజొన్న సాగు వద్దే వద్దు
 • నియంత్రిత పంటల సాగుపై కేసీఆర్‌వీడియో కాన్ఫరెన్స్‌18న 

బంగారానికైనా కొనేవాడుంటేనే ధర దక్కుతుంది. అందుకే అడవిలో ఉప్పు అమ్మాలి.. సాగర తీరంలో చింతపండు అమ్మాలి.. అంటారు. ఏది ఎక్కడ దొరకదో, అక్కడ దాన్ని అమ్మితేనే విలువ.వ్యవసాయం ఆహార అవసరాలను తీర్చే వృత్తి స్థాయిని దాటి,  లాభసాటి వ్యాపార హోదాగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, పండిన పంటకు సరైన ధర పొందడం ఎంత ముఖ్యమో, మంచి ధర వచ్చే పంటనే పండించడమూ అంతే ముఖ్యం. కాలంపై భారం వేసి, మొగులు దిక్కు ముఖం పెట్టి పంటలు పండించే రోజులు పోయాయి. కాల్వల్లో పారుతున్న నీళ్లతో ఎంత పంట వస్తుందో ఖాయంగా అంచనా వేసుకోగలిగిన రోజులివి. పంటతో పాటు ధరనూ పసిగట్టాల్సిన సమయమిది.తానేం పండించగలుగుతాడన్నది కాదు;  మార్కెట్లో దేనికి డిమాండ్‌ ఉందన్నదే సాగుకు ప్రాతిపదిక కావాలని వ్యవసాయ నిపుణులు సూచించారు. ఈ మేరకు రైతును చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారు ముఖ్యమంత్రికి నివేదించారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మారుతున్న పరిస్థితుల్లో పంటల ఎంపికలో తెలంగాణ రైతులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యవసాయరంగ నిపుణులు సూచించారు. అందరూ వరే వేయడం కన్నా, మార్కెట్లో ఉండే గిరాకీని, పంట కాలపు చీడపీడలను దృష్టిలో పెట్టుకుని సాగుకు దిగాలని సలహా ఇచ్చారు. ఉచిత విద్యుత్తు, కాళేశ్వర జలాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న తోడ్పాటు అప్పుడే రైతుకు లాభదాయకంగా మారుతుందని తేల్చిచెప్పారు. అన్నదాతలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న ప్రభుత్వంపైనే, రైతులను చైతన్య పరచాల్సిన బాధ్యత కూడా ఉందని అభిప్రాయపడ్డారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగువిధానం అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం వ్యవసాయరంగనిపుణులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయరంగ నిపుణులు పలు సూచనలు చేశారు. తెలంగాణలో సాగుభూమి, సాగుపద్ధతులు, దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్లను అధ్యయనంచేసిన వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్‌ సౌకర్యాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో వరి సాగు కంటే పత్తి పంట వేయడమే లాభదాయకమని వ్యవసాయరంగ నిపుణులు వివరించారు. వానకాలం వరి పంటపై చీడపీడల ప్రభావం ఎక్కువనీ, దిగుబడి తక్కువనీ వారు పేర్కొన్నారు. వాన కాలంలో వడ్లు ఎకరానికి 25-30 బస్తాలు వస్తే ఎక్కువనీ, ఖర్చులన్నీ పోను 20-25 వేలు మాత్రమే మిగులుతుందనీ వారు లెక్క వేశారు. అదే వానకాలంలో పత్తి బంగారంలా పండుతుందని తెలిపారు. ఎకరానికి 14-18 క్వింటాళ్లు పండుతుందనుకుంటే, ఖర్చులన్నీ పోను ఎకరానికి 50-60 వేలు మిలుతుందని వివరించారు. “తెలంగాణలో గతంలోనూ పత్తి సాగు గణనీయంగా ఉండేది. అయితే అది కేవలం వర్షాధారంగా మాత్రమే ఉండేది. వానలు సరిగా పడక రైతులు ఇబ్బంది పడే వారు. కానీ అప్పటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి పోలికే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పుడు రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నాయి.  అందువల్ల పత్తిని వర్షాధారంగా వేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. నీళ్లు కట్టే పత్తి పంట సాగు చేస్తే మంచి దిగుబడి ఖాయం. వరితో పోలిస్తే పత్తికి గిరాకీ ఎక్కువ. జాతీయంగా, అంతర్జాతీయంగా పత్తికి మంచి మార్కెట్‌ ఉంది” అని వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు. కరోనా సంక్షోభం కారణంగా, ఈసారి రైతులు పండించిన ధాన్యం మొత్తాన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేసిందనీ, కానీ ఇలా ఎప్పుడూ కొనే పరిస్థితి ఉండదనీ వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ధర రాని వరి కన్నా, ధర వచ్చే పత్తి పంటను రైతులు ఎంపిక చేసుకోవడమే ఉత్తమమని సూచించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే తెలంగాణలో వానకాలం, యాసంగి కలిపి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగుచేయాలని పేర్కొన్నారు. సన్నాలు, దొడ్డురకం కలిపినా ఇంతకు మించితే మంచి ధర దక్కడం కష్టమని అన్నారు. అందువల్ల ఈ వానకాలంలో వరి సాగు 40 లక్షల ఎకరాలకు మించకుండా, వచ్చే యాసంగిలో 25 లక్షల ఎకరాలకు మించకుండా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ రైతులను చైతన్య పరచాలని సూచించారు. వరికి బదులు 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయడం మేలని సూచించారు. మార్కెట్‌లో వరికన్నా మంచి డిమాండ్‌ ఉన్న పత్తితో ఎకరాకు రూ.50 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో వానకాలం పంటగా కందులను  వేయడం మంచిదని చెప్పారు. సమావేశంలో మంత్రులు ఎస్‌ నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌర సరఫరాలసంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, సీఎంవో కార్యదర్శులు భూపాల్‌రెడ్డి, స్మితాసబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.వ్యవసాయరంగ నిపుణుల సూచనలు

 • లాక్‌డౌన్‌ కారణంగా రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో యాసంగిలో ప్రభుత్వం అన్నిపంటలను కొనుగోలుచేసింది. కానీ, ప్రతిసారి ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో రైతులు మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను మాత్రమే పండించాలి.
 • వరిని ఎక్కువగా పండించడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. రాష్ట్ర అవసరాలు, బియ్యం మార్కెట్‌ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే వానకాలం, యాసంగి కలిపి 60లక్షల నుంచి 65 లక్షల ఎకరాల్లోనే వరి సాగుచేయాలి. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటవేస్తే గిట్టుబాటు ధర రావడం కష్టం. 65 లక్షల్లో సన్న, దొడ్డురకాలు కలి పి వానకాలంలో 40 లక్షలు, యాసంగిలో 25 లక్షల ఎకరాల్లో సాగుచేయాలి.
 • వరితో పోల్చుకుంటే పత్తి సాగు చాలా లాభదాయకం. తెలంగాణలో గతంలో పత్తిని వర్షాధారంగా సాగుచేశారు. కానీ, రాష్ట్రంలో సాగునీటి వసతి పెరుగడంతో కాలువల ద్వారా పారేనీటితో సాగుచేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. పంట కూడా నాణ్యంగా ఉంటుంది. 
 • వరిలో ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.40 వేల నికర ఆదాయం వస్తే.. పత్తికి రూ.50వేల వరకు వస్తుంది. తెలంగాణలో 65 నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించే అవకాశం ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లోనూ పత్తికి మంచి డిమాండ్‌ ఉండటంతో రైతుకు ఎంతో మేలు కలుగుతుంది.
 • పప్పుధాన్యాల్లో కందులకు మార్కె ట్లో మంచి డిమాం డ్‌ ఉన్నది. తెలంగాణలో వర్షాకాలం పంటగా వీటిని 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో సాగు చేయడం ఉత్తమం.
 • వర్షాకాలంలో మక్కలు అసలు పండించకపోవడం మంచిది. వర్షాకాలం మక్కల దిగుబడి ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుండగా.. యాసంగిలో 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు వస్తుంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాకాలంలో మక్కలు సాగు చేయవద్దు. మక్కలకు మార్కెట్లో డిమాండ్‌ కూడా అంతగా లేదు కాబట్టి, తెలంగాణ అవసరాలకు తగట్టు యాసంగిలో మాత్రమే సాగు చేసుకోవడమే మంచిది. వానకాలంలో వ్యక్తిగత అవసరాల కోసం సాగుచేయవచ్చుకానీ, వ్యాపారపంటగా మక్కలను సాగుచేయవద్దు.


logo