గురువారం 28 మే 2020
Telangana - May 14, 2020 , 17:03:15

భైంసా ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దు

భైంసా ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దు

నిర్మల్ : నాలుగు రోజుల క్రితం భైంసా పట్టణంలో జరిగిన అల్లర్లను పోలీసు పికెట్లు, పెట్రోలింగ్ ద్వారా శాంతిభద్రతలను పూర్తి స్థాయిలోఅదుపులోకి తీసుకువచ్చామని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని జిల్లా ఎస్పీ .శశిధర్ రాజు అన్నారు. భైంసా పట్టణంలోని వీధుల్లో పోలీసు దళాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అల్లర్లకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని మరికొంత మంది దోషులు పరారీలో ఉన్నా వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

 ప్రశాంతతకు భంగం కలిగిస్తూ ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిపై త్యరలో పీడీయాక్ట్ లో కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మత సామరస్యానికి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, అలాంటి వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, తప్పుడు వార్తలను ఇతరులకు ఫార్వర్డ్ చేసిన వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం భైంసాలో లాక్ డౌన్ కర్ఫ్యూ కొనసాగుతోందని సభలు సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదని సూచించారు. అనవసరంగా రోడ్ల పైకి వస్తూ కరోనా వైరస్ వ్యాప్తికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని , లాక్ డౌన్ కారణంగా భైంసా లో ఎలాంటి దుకాణాలు తెరిచేందుకు అనుమతి లేదని పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.


logo