బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 17:41:14

కూలీలను, రైతులను ఆదుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

కూలీలను, రైతులను ఆదుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

అందరికీ పని కల్పించడమే ధ్యేయం

కరోనా అంతమయ్యే వరకు స్వీయనియంత్రణ, భౌతిక దూరం పాటించాలి

పర్వతగిరిలో ఉపాధి హామీ కూలీలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

కూలీలను రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ ఉన్నారని, అందుకనుగుణంగా ఉపాధి హామీ పనులను వీలైనంత ఎక్కువ మందికి కల్పించాలని చూస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూలీలు చేస్తున్న పనులు,  కలుగుతున్న ఉపాధి వంటి విషయాలను వారినడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి, ఏయే చోట్ల ఎలా పనులు జరుగుతున్నాయనే విషయాన్ని ఆరా తీశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ కారణంగా లాక్‌ డౌన్‌ విధించాల్సి వచ్చిందని, దీంతో మొత్తం పనులన్నీ స్తంభించి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్నదన్నారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ కూలీలకు ఉపాధి కల్పించాలని చూస్తున్నారన్నారు. అందుకే ఉపాధి కూలీ రేట్లను కూడా పెంచారన్నారు. అలాగే రైతాంగాన్ని ఆదుకోవాలని చూస్తున్నారని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారని మంత్రి కూలీలకు తెలిపారు. కూలీలు, రైతులు బాగుంటే దేశం, రాష్ట్రం బాగుటుందని అన్నారు. 

కొత్తగా వస్తున్న కూలీలకు కూడా జాబ్‌ కార్డులు జారీ చేయాలని ఆదేశించినట్లు మంత్రి కూలీలకు తెలిపారు. అందరికీ పని కల్పించాలని చెప్పారు. ఇక లాక్‌ డౌన్‌ సమయంలో స్వీయ నియంత్రణతో, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలన్నారు. ఎండలు తక్కువగా ఉన్న సమయాల్లోనే పనులు చేపట్టాలని అక్కడున్న అధికారులను ఆదేశించారు.


logo