గురువారం 04 జూన్ 2020
Telangana - May 13, 2020 , 13:24:29

ఏపీ నిర్ణయంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇబ్బంది

ఏపీ నిర్ణయంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇబ్బంది

హైదరాబాద్‌ : శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించేలా ఈ నెల 5వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో 203ను విడుదల చేసింది అని ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ తెలిపారు. సంగమేశ్వర పాయింట్‌ నుంచి 3 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని జీవోలో పేర్కొన్నట్లు రజత్‌ కుమార్‌ తెలిపారు. మొత్తం 8 టీఎంసీలకు ప్రపోజల్‌ పెట్టారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టు వల్ల తాగు, సాగునీటికి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు.

పొరుగు రాష్ర్టాలతో కలిసిమెలిసి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీ కొత్త ప్రాజెక్టులు ఆపాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం తరపున నిన్న లేఖ రాశాం. అవసరమైతే నేరుగా కలిసి ఏపీ ప్రాజెక్టుపై వివరణ ఇస్తామన్నారు. టెలిమెట్రి పెట్టాలని గతంలోనే కేఆర్‌ఎంబీని కోరాం.. ఇప్పటికి ఎలాంటి చర్యలు లేవు అని రజత్‌ కుమార్‌ తెలిపారు. విభజన చట్టం ప్రకారం 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. ట్రిబ్యునల్‌లో కృష్ణా జలాల కేటాయింపుల అంశం పెండింగ్‌లో ఉందన్నారు. కృష్ణా జలాల పరిష్కారం కాకముందే కొత్త ప్రాజెక్టులు చేపట్టడం సరికాదు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తప్పనిసరి అని ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు.


logo