బుధవారం 03 జూన్ 2020
Telangana - May 12, 2020 , 19:35:16

కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం

కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం

హైదరాబాద్ : రాష్ర్టంలో నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి, మిర్చి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది. పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ లు పర్యటిస్తాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెట్టాయి. నకిలీ, కల్తీ విత్తనాలు తయారు చేసే వారిని, అమ్మే వారిని వెంటనే గుర్తించి, పిడి యాక్టు కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా పత్తి, మిరప విత్తనాలు నకిలీవి ఎక్కువగా అమ్మే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం వాటి నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. 

సమగ్ర వ్యవసాయ విధానానికి అనుగుణంగా వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ యూనివర్సిటీలో తెలంగాణలో పండించాల్సిన పంటలకు సంబంధించిన పరిశోధనలు ఎక్కువగా జరగాలని ఆదేశించింది. రైతుబంధు సమితిలు క్రియాశీలకంగా మారి వ్యవసాయ సంబంధమైన విషయాల్లో రైతులను సమన్వయ పరచాలని కోరింది. రాష్ట్రంలో గోదాముల నిర్వహణ అంతా సులభంగా, ఏకోన్ముఖంగా జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెటింగ్ శాఖను కూడా తెలంగాణలో అమలయ్యే వ్యవసాయ విధానానికి అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణలో పెద్ద ఎత్తున వరి పండుతుంది. ఆ వరిని బియ్యంగా మార్చడం కోసం రాష్ట్రంలో రైసు మిల్లుల సామర్ధ్యం బాగా పెరగాల్సి ఉంది. ఇందుకోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలేనే రైస్ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించనున్నారు.


logo