శనివారం 30 మే 2020
Telangana - May 12, 2020 , 19:26:54

వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాం

వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాం

హైదరాబాద్ : పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై వ్యవసాయ శాఖ అధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నేరుగా పంటలు పండించే రైతులు, అందులో పనిచేసే వ్యవసాయ కూలీలు, వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ఉండే వారు... ఇలా సమాజంలో 90-95 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతికిన వారే. మన రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం, దేశం వ్యవసాయక దేశం. దేశంలో ఒకప్పుడు తీవ్రమైన కరువు ఉండేది.

కీలకనామ సంవత్సరంలో అయితే విపరీతమైన ఆహార కొరత కూడా ఏర్పడింది. తొండల్లాగా బతకాల్సి వచ్చింది. ఈ తర్వాత అనేక పరిణామాలు మారాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ది సాధించాం. ఆహార కొరత లేకుండా అయింది. తర్వాత పరిణామాల్లో రైతు పండించిన పంటకు మంచి ధర రావడం లేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రైతులు పండించిన పంటలకు గౌరవ ప్రదమైన ధరలు రావాలంటే ఏం జరగాలి? అని మనం ఆలోచించుకోవాలి. గతం మాదిరిగానే ప్రభుత్వం ప్రేక్షక వహించి మౌనంగా ఉండాలా? మార్పు కోసం ప్రయత్నించాలా? దురదృష్టం కొద్దీ ఇప్పటి వరకు భారతదేశాన్ని పాలించిన ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం కూడా వ్యవసాయంపై చిత్తశుద్ధితో పనిచేయలేదు. తీవ్ర నిర్లక్ష్యం చేశాయి.

తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిలో మార్పు తేవడం కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. చేస్తున్నది. రాష్ట్రంలో గతంలో వ్యవసాయం పరిస్థితి వేరు, ఇప్పుడు వ్యవసాయం పరిస్థితి వేరు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నది. కరెంటు గండం గట్టెక్కింది. సాహసోపేతంగా తలపెట్టిన భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అవుతున్నది. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయి.

భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఈ సారి ప్రభుత్వం మొత్తం పంటను కొనుగోలు చేస్తున్నది. దేశం మొత్తం కరోనా ఉన్నప్పటకీ మరే రాష్ట్రంలో ఇలా మొత్తం పంటను కొనుగోలు చేయడం లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే కొనుగోలు చేస్తున్నాము. ఇది తెలంగాణ ప్రత్యేకత. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాభివృద్ది – రైతు సంక్షేమం కోసం కంకణబద్ధమై పనిచేస్తున్నది. ప్రపంచమే తెలంగాణ నుంచి నేర్చుకోవాలని అభిలషిస్తున్నది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.


logo