శనివారం 06 జూన్ 2020
Telangana - May 12, 2020 , 19:06:15

మా నీటిని దొంగిలిస్తే ఊరుకోం...

మా నీటిని దొంగిలిస్తే ఊరుకోం...

సీఎం కేసీఆర్‌ ఏపీ కోసం గొప్ప మనసుతో గోదావరి జలాలను నాగార్జునసాగర్‌కు తీసుకు వద్దామని భావించారని అన్నారు మంత్రి శ్రీనివాస్‌ గాడ్‌. కానీ ఏపీ సీఎం జగన్‌ మాత్రం కృష్ణా నీటిని అక్రమంగా తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించడం దారుణమన్నారు. శ్రీశైలం జలాలను అక్రమంగా తరలించుకుపోవాలని భావిస్తే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అపెక్స్‌ కమిటీ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టు ఎలా చేపడతారని మంత్రి ప్రశ్నించారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ చాలా ఆగ్రహంగా ఉన్నారని, కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు మంచి ఇతర ప్రాధాన్యాలు ఏమీ లేవన్నారు. ఇలాంటి పనులన్నింటినీ ఆపి తీరతాం అని, మా వాటా మేం వాడుకుని తీరతాం అన్నారు మంత్రి. 

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అపెక్స్‌ కమిటీ తీర్మానం లేకుండా ఇలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా తీసుకుంటాయో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న అందరూ కలిసి వచ్చి ఆంధ్రప్రదేశ్‌ చర్యలను అడ్డుకోవాలని ఆహ్వానించారు. ఇప్పటి వరకు వివిధ కేసుల వల్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అయ్యిందని, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు కంటే పాలమూరు ప్రాజెక్టే ముందు పూర్తయ్యేదన్నారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేసి మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు తాగు నీరు అందేలా చర్యలు చేపడతామన్నారు. ఇది త్వరలోనే సాధ్యమై తీరుతుందని అన్నారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో మొత్తం 100 టీఎంసీలకు గాను 70 టీఎంసీల నీటి నిల్వకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు మంత్రి.logo