శనివారం 30 మే 2020
Telangana - May 12, 2020 , 17:02:42

దాతృత్వాన్ని చాటుదాం..మానవత్వాన్ని పంచుదాం

దాతృత్వాన్ని చాటుదాం..మానవత్వాన్ని పంచుదాం

జనగామ : కరోనా నేపథ్యంలో పేద‌ల‌ను ఆదుకోవ‌డం ద్వారా దాతలు త‌మ దాతృత్వాన్ని చాటాలని, క‌రోనా క‌ష్టాలు తీరే వ‌ర‌కు ప్ర‌జ‌ల క‌ష్టాల్లో పాలు పంచుకోవాలని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.  జిల్లాలోని ఎల్ల‌రాయ‌ని తొర్రూరులో ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌కు, పాల‌కుర్తి లో ప‌లువురి దాత‌ల స‌హ‌కారంతో పారిశుద్ధ్య కార్మికులు, పేద‌ల‌కు కూర‌గాయ‌లు పంపిణీ చేశారు. అలాగే, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌లం కొండూరు, గ‌న్నారం గ్రామాల్లో కొంద‌రు ఆ గ్రామాల దాత‌ల స‌హ‌కారంతో నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులను మంత్రి పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, క‌ష్టాలు, క‌న్నీళ్ళు క‌ల‌కాలం ఉండ‌వు. క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడే మ‌నోళ్ళు ఎవ‌రో, మంది ఎవ‌రో తెలిసిపోతుందన్నారు. మ‌న గ్రామాల‌ను మ‌న‌మే బాగు చేసుకుంటున్న విధంగా, మ‌న గ్రామాల్లోని ప్ర‌జ‌ల‌ను మ‌న‌మే ఆదుకోవాలన్నారు.  ఒక‌రికొక‌రం ఆస‌రాగా ఉంటూ పేద‌ల‌ను ఆదుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. క‌రోనా క‌ష్టాలు తీరే వ‌ర‌కు నిరుపేద‌ల క‌ష్టాల‌ను తీర్చేందుకు దాత‌లు ముందుకు దాతృత్వాన్ని చాటాలని మంత్రి  కోరారు. తాను స్వ‌యంగా త‌మ కొడుకు, బిడ్డ‌ల నుంచి సేక‌రించినవే గాక‌, అనేక మంది స్నేహితుల నుంచి సేక‌రించిన డ‌బ్బులు, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను, ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ద్వారా మ‌రికొంద‌రికి విరివిగా పంపిణీ చేశామ‌న్నారు.  మ‌రికొద్ది రోజుల పాటు స్వీయ నియంత్ర‌ణ పాటించి, క‌రోనాని తరిమికొడుదామని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.


logo