మంగళవారం 26 మే 2020
Telangana - May 11, 2020 , 20:59:22

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడి లొంగుబాటు

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడి లొంగుబాటు

ములుగు : నిషేధిత మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు పెట్టి ఐతు అలియాస్‌ ఐతు(23) ఆరోగ్యం సహకరించక ఆదివారం సాయంత్రం పోలీసులకు లొంగిపోయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐతు లొంగుబాటు వివరాలను ఎస్పీ వెల్లడించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన ఐతు 2014 ఆగస్టులో మావోయిస్టు పార్టీ దళం పాటలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, వారి ఉపన్యాసాలకు ఆకర్షితుడై దళ కమాండర్‌ సంతోష్‌ ఆదేశాల మేరకు దళ సభ్యుడిగా చేరాడు. సీపీఐ మావోయిస్టు పార్టీలో అగ్రనేతలుగా ఉన్న హరిభూషన్‌, దామోదర్‌, వెంకటేశ్‌, ఆజాద్‌, భాస్కర్‌, బండి ప్రకాశ్‌ ఆదేశాల మేరకు పనిచేస్తూ పార్టీ అగ్రనేతల వద్ద అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. 2016 వరకు చర్ల దళ సభ్యుడిగా పనిచేస్తూ పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్‌ మిలటరీ చీఫ్‌ బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌కు గార్డుగా ఉన్నాడు. 

2017 జూన్‌లో ట్రైనింగ్‌ చేస్తూ కింద పడిపోగా ఐతు వెన్నుపూసకు దెబ్బ తగలడంతో లొంగిపోవాలని నిర్ణయించుకుని పార్టీ అగ్రనేతలకు తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇందుకు వారు ఒప్పుకోకపోవడంతో పార్టీలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 2019 డిసెంబర్‌లో ఏరియా కమిటీ మెంబర్‌గా పదోన్నతి కల్పించి బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌కు గార్డు ప్రొటక్షన్‌ టీం కమాండర్‌గా పనిచేస్తున్నాడని ఎస్పీ వెల్లడించారు. గత మూడేళ్ల నుంచి వెన్ను నొప్పితో బాధపడుతూ మావోయిస్టు పార్టీలో పనిచేయలేక ఇబ్బంది పడుతుండటంతో మార్చిలో తెలంగాణలో ఏదైనా విధ్వంసకర చర్యలు చేపట్టాలనే ప్రయత్నంలో భాగంగా శాపెల్లి ఫారెస్టు ఏరియాకు వచ్చి ఆరోగ్యం సహకరించకపోడంతో అసంతృప్తికి గురైనట్లు తెలిపారు. 

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కరోనా వైరస్‌ వల్ల తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో గొత్తికోయ గుంపులో నివాసం ఉంటున్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులను గిరిజనుల వద్ద నుండి మావోయిస్టు పార్టీ బలవంతంగా లాక్కొవడంతో పాటు వారికి సహకరించని వారిని ఇన్‌ఫార్మర్ల నెపంతో కాల్చి చంపారు. దీంతో పాటు పార్టీ విధానాలు నచ్చక, అనారోగ్య కారణాల వల్ల లొంగిపోయినట్లు ఐతు తెలిపాడని ఎస్పీ వెల్లడించారు. 

తాడ్వాయి మండలంలోని కామారంలోని  తన చిన్ననాన్న వద్దకు వచ్చి అతని సహాయంతో పోలీసులకు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. ఐతుపై రూ.4లక్షల రివార్డు ఉందని ఎస్పీ ప్రకటించారు. లొంగిపోయిన ఐతు జనజీవన స్రవంతిలో కలువనున్నట్లు తెలిపారని వివరించారు. ఈ  సమావేశంలో ఓఎస్డీ సురేశ్‌కుమార్‌, ఏఎస్పీ సాయిచైతన్య, తాడ్వాయి ఎస్సై రవీందర్‌ పాల్గొన్నారు. 


logo