గురువారం 28 మే 2020
Telangana - May 09, 2020 , 20:33:38

పరిసరాలను శుభ్రపరచుకోవాలి... పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పరిసరాలను శుభ్రపరచుకోవాలి... పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పురపాలక శాఖా మంత్రి కేటీఆర్‌ ఆదేశానుసారం ప్రతి మునిసిపాలిటీలో ప్రతీ ఆదివారం ఉదయం  10 గంటలకు 10 నిమిషాల పాటు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు తమ ఇళ్లను, ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి  పిలుపునిచ్చారు.  ఇప్పుడు ఉన్న కరోన వ్యాధికి అదనంగా మునిసిపాలిటీలో డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా మొదలైన జబ్బులు రాకూడదంటే ప్రజలందరూ ప్రతీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒక 10 నిమిషాల పాటు తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాబోయే వర్షా కాలంలో ఎలాంటి రోగాలు రాకూడదంటే ఇప్పటి నుండే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

ప్రతీ ఇంట్లో, ఇంటి పరిసరాల్లో చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇంట్లో చెత్తను మోరీల్లో వేయకూడదని, ఇంటి ముందుకొచ్చే మునిసిపల్ చెత్త బండికి అందచేయాలని తెలిపారు. ముఖ్యంగా దోమల నుంచి రక్షించుకోవడం కోసం ఇంటినీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరమన్నారు. డెంగీ దోమ లార్వాలు మంచినీటిలోనూ పెరుగుతాయి కాబట్టి మన పరిసరాల్లో నీరు చేరకుండా చూసుకోవాలని తెలిపారు. ఇళ్లు, పరిసరాల్లో పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, కాఫీ, టీల కోసం వాడి పారేసే ప్లాస్టిక్‌ కప్పులు, పాత కూలర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, ఇంటి ముందు ఉండే రోళ్లు, ఇంటి ముందు నీటి గుంతలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రజలను కోరారు.


logo