గురువారం 04 జూన్ 2020
Telangana - May 09, 2020 , 18:06:48

సన్న వంగడాల సాగు పెంచుదాం

సన్న వంగడాల సాగు పెంచుదాం

హాకాభవన్‌లో వానాకాలం సాగు సన్నాహాక చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్ష్యతన సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా వానాకాలం సాగుకు సన్నరకం వరి వంగడాలు అందుబాటులో ఉంచమని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏ మేరకు సన్న వంగడాలు అందుబాటులో ఉన్నాయో వెంటనే నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు సన్న వంగడాల సాగు విస్తీర్ణం పెరగాలని సూచించారు. దొడ్డు బియ్యం సాగు నుంచి సన్న బియ్యం సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు మంత్రి తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గత వానాకాలంలో 40 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా, అందులో 23 లక్షల ఎకరాలు సన్న వంగడాలు సాగయ్యాయని, ఈ సారి 30 నుండి 35 లక్షల ఎకరాలు సన్నరకాలు సాగయ్యేలా చర్యల తీసుకోవాలని సూచించారు. సాగుచేసేందుకు ముందుకొచ్చే రైతులందరికీ సన్న వంగడాలు అందించాలన్నారు మంత్రి. సాగు చేసే రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సాంకేతిక సలహాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.


logo